హైదరాబాద్, వెలుగు: డీఎంఈ డాక్టర్ల విషయంలో ఫోకల్, నాన్ -ఫోకల్ అనే విభజన లేకుండా పాత పద్ధతిలో నే హైదరాబాద్, నాన్ హైదరాబాద్ కేటగిరీలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) కోరింది. జీవో 38 ప్రకారం సీనియారిటీకే తొలి ప్రాధాన్యత ఇస్తూ, యూనియన్ల మినహాయింపులపై జీఏడీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
సంఘం ప్రతినిధులు శనివారం హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పరిసర ప్రాంతాల్లో (పెరిఫెరీ) సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న డాక్టర్లకు న్యాయం చేసేలా బదిలీల పరిమితిని 40 శాతానికి పెంచాలని, బదిలీల అర్హత కాలాన్ని రెండేండ్లకు తగ్గించడంతో పాటు బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు. పారదర్శకత కోసం ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
