
- టీయూజేఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
- రేవతి అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఖండించడమేంటి: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
- సోషల్ మీడియాలో బూతు భాష నియంత్రించాలి: కోదండరాం, చాడ, పాశం యాదగిరి
హైదరాబాద్, వెలుగు: మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఎలా ఖండిస్తుందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పోస్ట్చేసిన కంటెంట్‌ను పరిశీలించారా? మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అనేది గిల్డ్తెలియజేయాలన్నారు. ప్రజాక్షేత్రంలో లేని, సీఎం కుటుంబంలోని మహిళలను బండబూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ‘‘సోషల్ మీడియాలో వాడుతున్న భాష సమంజసమేనా?’’ అనే అంశంపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
మీటింగ్‌లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణ ఉండాలని అన్నారు. భావ ప్రకటనకు మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప బూతుకు స్వేచ్ఛ లేదన్నారు. అసభ్యంగా మాట్లాడటం ఏ సంస్కృతిలోనూ లేదని.. స్వేచ్ఛను ప్రభుత్వాల చేతిలో పెట్టకుండా స్వీయ నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. బూతు భాషా ప్రయోగం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
వ్యక్తిగత దూషణ తగదు
మీడియాకు స్వేచ్ఛ ఉండాలిగానీ అది పరాకాష్టకు చేరి పరుష పదజాలాలకు దారితీయరాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా ఉపయుక్తమయ్యే అంశాలు కూడా ఉన్నాయని, అయితే కొందరి వల్ల అది పక్కదారి పట్టి మీడియా విలువలను దిగజారుస్తున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. విమర్శలు చేయడం తప్పుకాదు గానీ వ్యక్తిగత వ్యవహారాలను దూషించడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు పరిష్కార మార్గాలు అన్వేషించాలన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. సోషల్ మీడియాను సరిగ్గా వాడకపోతే చివరకు మనకే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు.
మీడియాలో స్వీయ నియంత్రణ, భాషా నియంత్రణ అవసరమని చెప్పారు. ఒకవేళ ప్రజలు ఆవేశంలో మాట్లాడినా వాటిని ఎడిట్ చేసి పోస్టింగ్ చేయాలని సూచించారు. సీపీఐ మాజీ శాసన సభా పక్షనేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫేక్ న్యూస్ వేగంగా వ్యాపిస్తోందన్నారు. నాగరిక సమాజంలో అనాగరిక భాష ఏంటని ప్రశ్నించారు. టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మైకులు పెట్టి మాట్లాడిస్తే జర్నలిస్టులవుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని కొన్ని శక్తులు వెనుక ఉండి నడిపిస్తున్నాయని ఆరోపించారు. జర్నలిస్టు రఘు మాట్లాడుతూ.. మీడియాలో కొన్ని సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో టీయూజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎం రహమాన్, జస్టిస్ చంద్రకుమార్, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.