తుంగభద్ర, నారాయణపూర్‌‌ గేట్లు ఓపెన్‌‌

తుంగభద్ర, నారాయణపూర్‌‌ గేట్లు ఓపెన్‌‌

హైదరాబాద్‌‌ : ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు సోమవారమే ఎత్తగా, నారాయణపూర్‌‌, తుంగభద్ర డ్యాంల గేట్లు మంగళవారం ఎత్తారు. నారాయణపూర్‌‌ నుంచి జూరాల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని వదిలేస్తున్నారు. తుంగభద్ర పూర్తిగా నిండడంతో బుధవారం ఈ డ్యాం నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలే చాన్సుంది. మరోవైపు జూరాల పవర్‌‌ హౌస్‌‌ల ద్వారా నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఇటు జూరాల, అటు తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమేణా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం మధ్యాహ్నానికి జూరాల గేట్లు ఎత్తే అవకాశముంది. దీంతో శ్రీశైలంలోకి కనీసం లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చే చాన్సుంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌‌ ప్రాంతంలో ఇంకో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కృష్ణా బేసిన్‌‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముందని ఇరిగేషన్‌‌ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు గోదావరి బేసిన్‌‌లోని ప్రాజెక్టులకూ భారీ వరద కొనసాగుతూనే ఉంది. శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు నుంచి మొదలుకొని కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం (సమ్మక్కసాగర్‌‌), సీతమ్మసాగర్‌‌ బ్యారేజీలు నిండి నీళ్లు బంగాళాఖాతంలోకి పరుగులు పెడుతున్నాయి. ఎల్లంపల్లికి ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌‌ఫ్లో వస్తుండగా మేడిగడ్డ, తుపాకులగూడెం, సీతమ్మసాగర్‌‌ల వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. రాష్ట్రంలో గోదావరి బేసిన్‌‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్​లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇంకో మూడు, నాలుగు రోజులు వరదలు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు.

గోదావరి డేంజర్​బెల్స్​ : 
భారీ వర్షాలతో గోదావరి ఉధృతి మరోసారి పెరుగుతున్నది. మేడిగడ్డ బ్యారేజీకి మంగళవారం పొద్దున 6.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ ఫ్లో ఉండగా సాయంత్రానికి 8.60 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు. భద్రాచలం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు గోదావరి లెవల్​ 52.90 అడుగులకు తగ్గగా.. జిల్లా కలెక్టర్​ మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కానీ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల రాత్రి గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు.