- ఈ -నామ్ సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడంతో నష్టపోతున్నామని మార్కెట్ ఆఫీస్ ముట్టడి
- ఆఫీస్ అద్దాలు.. కుర్చీలు ధ్వంసం
నిజామాబాద్, వెలుగు : ఈ–నామ్ సాఫ్ట్ వేర్ పనిచేయకపోవడంతో వ్యాపారులు సిండికేటై తక్కువ రేటు కోట్ చేస్తున్నారంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన పసుపు రైతులు నిజామాబాద్‌లో ఆందోళనకు దిగారు. వారం కింద క్వింటాల్‌కు రూ. 16 వేలు చెల్లించిన వ్యాపారులు.. ఇప్పుడు రూ. 10 వేలే ఇస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ ఆఫీస్‌ను ముట్టడించి అద్దాలు పగులగొట్టి, కుర్చీలు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే... పసుపు అమ్మకాల కోసం మూడేండ్లుగా వాడుతున్న ఈ– నామ్1.0 సాఫ్ట్‌వేర్ గడువు మార్చి 31తో ముగియడంతో దాని స్థానంలో పూర్తిగా డెవలప్ చేయని 2.0 సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
దీని వినియోగంలో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో రైతులు, మార్కెట్ సిబ్బంది ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీంతో 2.0 సాఫ్ట్‌వేర్ పూర్తిగా డెవలప్ చేసే దాకా ఓపెన్ యాక్షన్ విధానంలో పసుపు అమ్మకాలు సాగించాలని ఈ నెల 3న మార్కెట్ పాలకవర్గం నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు సిండికేట్ మారారు. ప్రతి రోజు ఒక్కరిద్దరు వ్యాపారులే వేలంలో పాల్గొంటు తక్కువ ధర కోట్ చేస్తున్నారు. వారం కిందటి వరకు రూ. 16 వేలు పలికిన క్వింటాల్ పసుపు.. ప్రస్తుతం రూ. 10 వేలకు మించడం లేదు. బుధవారం నిజామాబాద్ మార్కెట్‌కు 45 వేల బస్తాల పసుపు వచ్చింది.
వ్యాపారులు తక్కువ రేట్ కోట్ చేయడంతో ఆగ్రహానికి గురైన రైతులు మార్కెట్ ఆఫీస్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో కొందరు రైతులు ఆఫీస్ అద్దాలు పగులగొట్టి, కుర్చీలను విరగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్‌కు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. రైతుల ఆందోళన విషయాన్ని మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్‌ను పంపారు. గురువారం నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గంజ్‌లో ఇప్పుడున్న పసుపు అమ్మకాలు ముగిసే దాకా కొత్తగా టోకన్లు ఇవ్వబోమని సెక్రెటరీ అపర్ణ ప్రకటించారు.

