Turtle Boy: తాబేలు పెంకులా బాలుడి చర్మం.. పుట్టుకతోనే అరుదైన వ్యాధి

Turtle Boy: తాబేలు పెంకులా బాలుడి చర్మం.. పుట్టుకతోనే అరుదైన వ్యాధి

పుట్టినప్పుడు ఎవరైనా సగం మనిషిగా సగం జంతువుగా ఈ ప్రపంచంలోకి వచ్చారని కథలు లేదా మాయా చిత్రాలలో చూసి ఉంటారు.  సాధారణంగా అలా జరగడం చాలా అరుదు. కానీ యూఎస్ ఫ్లోరిడాలో ఓ పిల్లవాడు అలాగే జన్మించాడు. అతని వీపు భాగంలో తాబేలు పెంకులా కనిపించే విభిన్నమైన చర్మపు పొర ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చాలా మంది పిల్లలు పుట్టిన సమయంలో  సాధారణ బరువు కంటే తక్కువ లేదా ఎక్కువగా ఉండడం చూస్తూనే ఉంటాం. కొందరి పిల్లల శరీరంపై దట్టమైన వెంట్రుకలు ఉండవచ్చు లేదా మరికొందరు తోకతో పుట్టవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పిల్లవాడు మాత్రం చాలా విచిత్రంగా పుట్టాడు. పిల్లవాడి వెనుక భాగాన తాబేలు వంటి షెల్ ఉంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

తాబేలు పెంకుతో పుట్టిన చిన్నారి...

ఈ వింత ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. డైలీ స్టార్ నివేదిక ప్రకారం, పిల్లాడి పేరు జేమ్స్. అతని వయస్సు 19 నెలలు. జేమ్స్ జన్మించినప్పుడు అరుదైన చర్మ సమస్యతో పుట్టాడు. వీపు భాగంలో 75 శాతం తాబేలు షెల్‌తో కప్పబడి ఉన్నట్టు చర్మం ఉంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు స్కాన్‌లో ఇలాంటిదేమీ కనుగొనబడలేదు. కానీ పుట్టినపుడు మాత్రం వైద్యులు, సిబ్బందితో పాటు తల్లిదండ్రులు కూడా బాలుడి విచిత్రమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

మొదట పుట్టుమచ్చ అనుకున్నారు..

తల్లి తన బిడ్డ వీపుపై ఉన్న వింత గుర్తును చూసి మొదటగా పుట్టుమచ్చగా భావించింది. పరీక్ష రిపోర్టు రాగానే ఆ చిన్నారికి అరుదైన వ్యాధి ఉందని, దాని వల్లే వెన్నుపై చర్మం అలా ఉందని తేలింది. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు వారు 2022 సంవత్సరంలోనే శస్త్రచికిత్స ద్వారా పిల్లాడి వెనుక భాగంలో పెరుగుతున్న కణితిని తొలగించారు. ఇంకా శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, ఆ తర్వాత బిడ్డ మరింత మెరుగవుతాడని డాక్టర్లు తెలిపారు. పుట్టుకతోనే ఈ చిన్నారికి సమస్య ఉండడంతో అతను వెనుకభాగాన్ని నేలకు ఆన్చి నిద్రపోలేడు.. కానీ శస్త్రచికిత్స తర్వాత అతను పడుకోవచ్చని స్పష్టం చేశారు.