చిట్యాల, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 252 గందరగోళంగా ఉందని, దానిని తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ( హెచ్- 143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి మూడా వేణు తెలిపారు.
చిట్యాలలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు అంటూ రెండు రకాల కార్డులు ప్రవేశపెట్టి గందరగోళం సృష్టిస్తోందన్నారు. కొత్త నిబంధనలతో 10 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, నియోజకవర్గ స్థాయిలో కార్డుల సంఖ్యను భారీగా తగ్గించడం వల్ల పార్ట్ టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ జీవోను పునఃసమీక్షించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేలా సవరించాలని డిమాండ్ చేశారు.
