- టీయూడబ్ల్యూయూజే(ఐజేయూ) నేతలు
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం అప్రజాస్వామికమని టీయూడబ్ల్యూయూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. టీయూడబ్ల్యూయూజే(టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు, టీన్యూస్ ఉమ్మడి జిల్లాల ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, వీడియో జర్నలిస్టు నాగరాజు, లైవ్ కిట్ టెక్నీషియన్ పై ఖమ్మం జిల్లా కొనిజర్ల పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.
జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ సోమవారం ఖమ్మం జడ్పీ సెంటర్ లో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కొరకు రైతులు పడే కష్టాలను జర్నలిస్టులు ప్రసార, పత్రిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తప్పా.. అని ప్రశ్నించారు.
ఉద్దేశపూర్వకంగా పోలీసులు బలమైన సెక్షన్ల కింద జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే మంత్రులు స్పందించి జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
