టీవీ9 CEOగా రవిప్రకాశ్ తొలగింపు.. కొత్త CEO, COO నియామకం

టీవీ9 CEOగా రవిప్రకాశ్ తొలగింపు.. కొత్త CEO, COO నియామకం

హైదరాబాద్ : తెలుగు న్యూస్ ఛానెల్ TV9 యాజమాన్యం మారింది. ఈ విషయాన్ని హైదరాబాద్ లో యాజమాన్య ABCL సంస్థ బోర్డ్ సభ్యులు ప్రకటించారు. 9 నెలల కిందట ABCL సంస్థలో 90.5 శాతం షేర్స్ ను అలందా మీడియా కొనుగోలు చేసిందని  బోర్డ్ సభ్యుడు సాంబశివరావు చెప్పారు. మెజారిటీ షేర్ ఉన్న అలందా మీడియా నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ లో అపాయింట్ చేశారని చెప్పారు. ఏబీసీఎల్ లో అప్పుడున్న యాజమాన్యం తీరు కారణంగా.. డైరెక్టర్స్ అపాయింట్ మెంట్ ప్రక్రియ ఆలస్యమైందన్నారు. మధ్యలో.. తమను డైరెక్టర్స్ గా కంపెనీ బిజినెస్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలులేకుండా రవిప్రకాశ్, మూర్తి తమకు ఆటంకాలు కలిగించారనీ.. ఇప్పుడు అన్ని అనుమతులతో TV9ను అలంద టేకోవర్ చేసినట్టుగా బోర్డ్ సభ్యులు చెప్పారు. 

ఇప్పటి వరకూ TV9 CEO, చైర్మన్, ఫౌండర్ గా ఉన్న రవిప్రకాశ్ కు కొత్త యాజమాన్యం ఉద్వాసన పలికింది. శుక్రవారం సాయంత్రం సమావేశమైన ABCL డైరెక్టర్స్…. TV9కు కొత్త CEO, COOలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ABCL కంపెనీ CEOగా మహేంద్ర మిశ్రా, COOగా గొట్టిపాటి సింగారావును ABCL డైరెక్టర్స్ బోర్డు నియమించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ABCL డైరెక్టర్స్ బోర్డు ఆయనకు అదనంగా టీవీ9 తెలుగు బాధ్యతలను అప్పజెప్పింది. 

రవిప్రకాశ్ మైనారిటీ షేర్ హోల్డర్ మాత్రమే : సాంబశివరావు

మే 8వ తేదీన జరిగిన బోర్డ్ మీటింగ్ లోనే .. రవిప్రకాశ్ ను CEO పదవినుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు బోర్డు సభ్యులు. అదేరోజు మూర్తిని కూడా తొలగించినట్టుగా చెప్పారు. ఏబీసీఎల్ లో అలందా మీడియా షేర్ 90.5శాతం ఉందనీ… మిగిలినదాంట్లో.. రవిప్రకాశ్ కూడా ఓ మైనారిటీ షేర్ హోల్డర్ గా కొనసాగుతారని బోర్డ్ సభ్యుడు సాంబశివరావు తెలిపారు. ఛానెల్ కార్యకలాపాలతో రవిప్రకాశ్, మూర్తిలకు ఇకనుంచి ఎటువంటి సంబంధం లేదన్నారు. టీవీ9కు సంబంధించి ఈ ఇద్దరితో బ్యాంకులు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపొద్దని కోరారు. TV9 ఉద్యోగుల్లో ఎటువంటి మార్పు ఉండదని… మరింత మంది ఉద్యోగులు అవసరమైతే చేర్చుకుంటామని చెప్పారు. రవిప్రకాశ్ ఇప్పటివరకు కొత్త బోర్డ్ మీటింగ్ రాలేదన్నారు. ఒక వ్యక్తి వల్ల ఛానెల్ అభివృద్ధి చెందదనీ… టీవీ9 ఒకరి వల్ల అభివృద్ధి కాలేదనీ.. అది టీమ్ వల్లే అయిందని చెప్పారు సాంబశివరావు.