దళపతి విజయ్‌కు ఐటీ శాఖ షాక్.. భారీగా జరిమానా, హైకోర్టులో సవాల్!

దళపతి విజయ్‌కు ఐటీ శాఖ షాక్.. భారీగా జరిమానా, హైకోర్టులో సవాల్!

తమిళ దళపతి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ ఆదాయపు పన్ను శాఖ  ఊహించని షాక్ ఇచ్చింది. 2015- 16కు సంబంధించిన తన వాస్తవ ఆదాయాన్ని వెల్లడించడలేదని నోటీసులు ఇచ్చింది.  ఆదాయ లెక్కలు చూపించనందుకు కోటీ 50 లక్షల రూపాయల జరిమానా విధించింది.  దీంతో ఐటీ శాఖ వేసిన జరిమానాను సవాలు చేస్తూ విజయ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ నేపథ్యంలో తమిళనాట ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. 

'పులి' మూవీ పారితోషకమే అసలు చిక్కు!

అసలుఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు 'పులి' చిత్రం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి తాను రూ. 35.42 కోట్ల ఆదాయాన్ని ప్రకటించినట్లు విజయ్ తెలిపారు. అయితే, 2015లో విజయ్ నివాసంలో ఐటీ శాఖ నిర్వహించిన మెరుపు దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా, 'పులి' సినిమా ద్వారా వచ్చిన రూ. 15 కోట్ల ఆదాయాన్ని ఆయన లెక్కల్లో చూపించలేదని ఐటీ శాఖ ప్రధాన ఆరోపణ. ఈ కీలక అంశాల ఆధారంగా.. ఐటీ శాఖ 2022 జూన్ 30న విజయ్ కు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు రూ. 1.5 కోట్ల జరిమానా విధించింది. వెంటనే చెల్లించాలని పేర్కొంది.  ఈ ఆలస్యంగా వచ్చిన ఉత్తర్వులనే విజయ్ హైకోర్టులో సవాలు చేశారు.

విజయ్ అభ్యంతరం ఇదే!. 

విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సింగిల్ జడ్జి, ఐటీ శాఖ ఉత్తర్వుల అమలుపై ఇప్పటికే తాత్కాలిక స్టే మంజూరు చేయడం గమనార్హం. మంగళవారం (సెప్టెంబర్ 24) ఈ పిటిషన్ జస్టిస్ సి. శరవణన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ తరఫు న్యాయవాది ఒక ఆసక్తికరమైన సాంకేతిక పాయింట్‌ను లేవనెత్తారు. ఐటీ చట్టం ప్రకారం, ఈ జరిమానా ఉత్తర్వును 2019 జూన్ 30లోపు జారీ చేసి ఉండాలి. కానీ, ఐటీ శాఖ మూడు సంవత్సరాలు ఆలస్యం చేసి, 2022లో ఉత్తర్వులు జారీ చేసిందని, కాబట్టి ఈ ఆలస్యం కారణంగా ఆ ఉత్తర్వును కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు.

విజయ్ తరపు నుంచి వాదనలను ఐటీ శాఖ తరపు న్యాయవాది తప్పుపట్టారు.  విజయ్‌పై విధించిన జరిమానా ఆదాయపు పన్ను చట్టం కింద పూర్తిగా చెల్లుబాటు అవుతుందన్నారు. అందువల్ల ఆయన పిటిషన్‌ను తక్షణమే కొట్టివేయాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. విజయ్ రాజకీయంగా బిజీగా మారుతున్న తరుణంలో, ఐటీ వివాదంపై కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ తమిళనాట నెలకొంది.