కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో రేవంత్, కోమటిరెడ్డి ట్వీట్ల ఫైట్

కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో రేవంత్, కోమటిరెడ్డి ట్వీట్ల ఫైట్
  •     స్కామ్‌‌‌‌లలో కాంగ్రెస్ లెజెండ్.. కర్నాటకలో ఎన్నికల ట్యాక్స్: మంత్రి కేటీఆర్
  •     గాలి మాటలు ఆపి.. మీ కల్వకుంట్ల ‘స్కామిలీ’ గురించి చెప్పు: రేవంత్
  •     ‘కే ట్యాక్స్’తో రాష్ట్రంలో వేల కోట్ల దోపిడీ: కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  మంత్రి కేటీఆర్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మరోసారి మాటల యుద్ధం సాగింది. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ (ఎక్స్) వేదికగా ట్వీట్ల వార్ సాగింది. ఎన్నికల కోసం బిల్డర్లకు కాంగ్రెస్ ట్యాక్స్ వేసిందని కేటీఆర్ ఆరోపించగా.. కమీషన్లు, లిక్కర్ స్కామ్‌‌‌‌లతోనే బీఆర్ఎస్ నడుస్తున్నదని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘కే ట్యాక్స్’తో రూ.వేల కోట్లు దండుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది?: రేవంత్

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే.. కొడుకుకేమో పూర్తిగా మతి తప్పినట్టుందని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నిండా అవినీతిలో మునిగి.. నిద్రలో కూడా కమీషన్ల గురించి మాట్లాడే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనపెట్టు. తెలంగాణలో మీ కల్వకుంట్ల ‘స్కామిలీ’ గురించి చెప్పు. దళితబంధులో 30 శాతం కమీషన్లను దండుకుంటున్నామని స్వయంగా మీ నాయనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు. లిక్కర్ స్కామ్‌‌‌‌లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసున్నారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.

భూములు, లిక్కర్​ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయాన్ని అందరికీ చెప్పు’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో.. ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో.. ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్​ను అడ్డుకోవడం నీ వల్లకాదు కదా.. మీ నాయన వల్ల కూడా కాదు’’ అంటూ మండిపడ్డారు.

లూట్ సూట్ సర్కార్: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

బీఆర్ఎస్ అంటే లూట్ సూట్ సర్కార్ అని కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. ‘‘ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ‘కే ట్యాక్స్’ పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకోవడాన్ని అలవాటు చేసుకున్నది. పార్టీకి, కుటుంబానికి ఫండ్‌‌‌‌గా తీసుకుంటున్నారు. వారికి ఫ్యామిలీ ఫస్ట్​.. ప్రజలు లాస్ట్. అదే వారి ఎజెండా. తొమ్మిదేండ్ల నుంచి దాన్నే అమలు చేస్తున్నారు. ఫేకూ యువరాజ్ కేటీఆర్.. అన్ని సూట్లను (కార్పొరేట్లు) దోచుకుంటున్నారు.

మోసగాడైన ఆయన తండ్రి.. ప్రజలను విస్మరించారు. పార్టీ బ్యాంకు ఖాతాల్లా రూ.900 కోట్లు, బినామీ అకౌంట్లలో రూ.90 వేల కోట్లు పోగేసుకున్నారు. వాళ్లెంత దోచుకున్నా.. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. వారికి సరైన నివాసం జైలు అని నిరూపిస్తాం’’ అని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

పాత అలవాట్లు ఏడికిపోతయ్ :  కేటీఆర్

‘‘కర్నాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఎన్నికల ట్యాక్స్ వేస్తున్నది. బెంగళూరు బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500 వసూలు చేసి.. తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నది. పాత అలవాట్లు ఏడికిపోతయ్. అత్యంత పురాతనమైన ఆ పార్టీ.. స్కామ్‌‌‌‌లలో లెజెండ్. అందుకే ఆ పార్టీని ‘స్కాంగ్రెస్’ అని అంటున్నారు. వాళ్లు ఎంత డబ్బును తెలంగాణకు తీసుకొచ్చి ఖర్చు పెట్టినా ప్రజలు మాత్రం మోసపోరు. తెలంగాణలో స్కాంగ్రెస్​కు నో చెప్పండి’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.