మిస్టరీ: రక్తపు వాన కురిసి 20 ఏళ్లు

మిస్టరీ: రక్తపు వాన కురిసి 20 ఏళ్లు

మనం ఇదివరకు కప్పల, చేపల వర్షాల గురించి విన్నాం, చూశాం. కానీ.. రక్తపు వర్షం గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు రక్తపు వర్షం ఉంటుందా? అనే అనుమానం వస్తుంది కదా! మన దగ్గరే ఇరవై ఏళ్ల క్రితం పడింది. అప్పట్లో ఇదే హాట్‌‌ టాపిక్‌‌. మరి ఆ విషయం గురించి ఇప్పుడెందుకంటారా? ఆ రక్తపు వాన కురిసి ఈ రోజుకు సరిగ్గా ఇరవై ఏళ్లు. అయినా.. ఇప్పటివరకు ఏ సైంటిస్ట్‌‌ ఆ రెయిన్‌‌ మిస్టరీని తేల్చి చెప్పలేకపోయారు.

ఇరవై ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. కేరళలోని ఇడుక్కి, కొట్టాయం ప్రాంతాల్లో జనాలు ఎవరి పనుల్లో వాళ్లున్నారు.  ఒక్కసారిగా నల్లని దుప్పటి కప్పినట్టు మబ్బులు అలుముకున్నాయి. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు. బయట బట్టలు ఆరేసినవాళ్లు కంగారు పడుతున్నారు. పొలాల్లో విత్తనాలు చల్లినవాళ్లు ఆనందపడుతున్నారు. పిల్లలు కేరింతలు కొడుతూ వాకిట్లో గంతులేస్తున్నారు. వర్షం కురవడం మొదలైంది. నిమిషాల్లోనే వాతావరణం ఎరుపెక్కింది. వర్షపు నీరు గులాబి రంగులోకి తర్వాత ఎరుపు రంగులోకి మారింది. అప్పటివరకు వర్షాన్ని చూసి ఎంజాయ్‌‌ చేస్తున్నవాళ్ల కళ్లలో ఆశ్చర్యం, ఆ వెంటనే భయం.. ఎందుకంటే వచ్చింది మామూలు వాన కాదు. రక్తపు వాన. ఈ తరం వాళ్లు అప్పటివరకు చూడని ఎరుపురంగు వాన. వెంటనే రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. అందరూ ఇళ్లలోకి పరుగెత్తారు. కాసేపటికి తేరుకుని ఎరుపురంగు నీళ్లే వర్షంగా కురుస్తుందని తెలుసుకుని కుదుటపడ్డారు. అసలు ఆ రోజు వాన ఎరుపురంగులో ఎందుకు పడిందనేది ఇప్పటికీ అంతుచిక్కని  రహస్యమే. 
ప్రచారంలోకి కథలు
నైరుతి రుతు పవనాలు దాదాపుగా కేరళలోనే మొదలవుతాయి. అందులో భాగంగానే 2001 జులై 25న వర్షం మొదలైంది. కొద్దిసేపట్లోనే వర్షం ఎర్ర రంగులో కురవడం మొదలైంది. ఆ నీళ్లు పడ్డ బట్టలు కూడా రక్తపు మరకలైనట్టు ఎర్రగా మారాయి. ఈ వాన కేరళ సముద్ర తీర ప్రాంతం.. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇరవై నిమిషాలపాటు కురిసింది. ఆ వానను చూసి జనాలు భయపడిపోయారు. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందని బెంబేలెత్తిపోయారు. ఆ వానను యుగాంతానికి సూచిక అని చాలామంది అనుకున్నారు.  ఇక పుకార్లకైతే కొదవే లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు సిద్ధాంతాలు తయారుచేసుకున్నారు. వాళ్లకు తెలిసీ, తెలియని విషయాలకు  ఫిలాసఫీని జోడించి కథలు ప్రచారం చేశారు. అయితే... ఈ వాన ఒక్కసారి కురిసి ఆగిపోతే పర్వాలేదు. కానీ.. జులై నుంచి సెప్టెంబర్‌‌ దాకా అక్కడక్కడా పడుతూనే ఉంది. ఆ నీళ్లను టెస్ట్ చేసిన సైంటిస్ట్‌‌లు కూడా ఏమీ తేల్చలేకపోయారు. దాంతో పుకార్లు బాగా వ్యాపించాయి.  అంతలోనే కొంతమంది ఆకుపచ్చ, నలుపు, పసుపు రంగు వర్షాలు కూడా కురిశాయని చెప్పారు. అంతేకాదు ఈ రెడ్‌‌ రెయిన్‌‌ కురిసిన చాలాచోట్ల కొన్ని చెట్ల ఆకులు రంగు మారాయి. కానీ.. రక్తపు వాన కురిసినప్పుడు అంటుకున్న ఎరుపురంగులోకి కాదు. కెమికల్‌‌ రియాక్షన్‌‌ వల్ల ఆకులు బూడిద రంగులోకి మారాయి. కొన్ని చోట్ల ఆకులు మాడిపోయినట్లు అక్కడివాళ్లు చెప్పారు. ఇలా ఎందుకు జరిగిందని చాలామంది తలలు పట్టుకున్నారు. సైంటిస్ట్‌‌లు రీసెర్చ్‌‌ చేశారు. అయినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 
యుగాంతం? 
ఈ వర్షం పడ్డప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఇది యుగాంతానికి సూచిక అనుకున్నారు. ఈ వర్షం కురిసిన తర్వాత ఏడాదిలోగా ప్రపంచం నాశనం అవుతుందని, భూమి అంతరించిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని చాలామంది నమ్మారు. సైంటిస్ట్‌‌లు ‘కురిసింది రక్తం కాదు’ అని చెప్పినా నమ్మలేదు. 
గ్రహాంతర కణాలు
రక్తపు వర్షం కురిసినప్పటి నుంచి దానిమీద రీసెర్చ్‌‌లు జరుగుతూనే ఉన్నాయి. 2006లో కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న గాడ్ఫ్రే లూయిస్, సంతోష్ కుమార్‌‌‌‌ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ వాన చినుకుల్లో తెలియని ఎక్స్‌‌ట్రాటెర్రెస్ట్రియల్‌‌ సెల్స్‌‌(గ్రహాంతర కణాలు) ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇతర గ్రహాల నుంచి వచ్చి వాతావరణంలో చేరిన కణాలు వర్షం ద్వారా భూమిపై పడ్డాయని అన్నారు. కానీ.. వీళ్లు చెప్పిన సిద్ధాంతానికి సరైన రుజువులు చూపించలేకపోయారు. అందుకే దీన్ని కూడా కొట్టిపారేశారు. నైట్రోజన్‌‌, కార్బన్ ఐసోటోపిక్ నిష్పత్తులు ఉండడం వల్ల అది కచ్చితంగా భూ వాతావరణం వల్ల ఏర్పడ్డ వర్షమే అని ఇంకొందరు వాదించారు. 
మరో సిద్ధాంతం
గ్రహాంతర వాసుల సిద్ధాంతాన్ని కొట్టిపారేసిన తర్వాత  కొంతమంది మరో సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. పాన్స్‌‌పెర్మియా అని పిలువబడే సూక్ష్మజీవుల రూపమే ఈ ఎర్రని వర్షమని, ఈ సూక్ష్మజీవులు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయని చెప్పారు. అయితే.. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచమంతా ఎర్రని వర్షం పడాలి. కానీ.. కేరళలో మాత్రమే ఎందుకు పడిందని చాలా మంది ప్రశ్నించారు. దాంతో ఈ సిద్ధాంతాన్ని కూడా కొట్టిపారేశారు. 
కీడు జరుగుతుందనే.. 
కొన్ని మైథాలజీల ప్రకారం ఎరుపు రంగు కీడు జరుగుతుందని చెప్పడానికి సూచన. దాంతో చాలామంది దేవుడే ఇలా రక్తపు వర్షం కురిపించాడని, త్వరలో లోకాన్ని అంతం చేస్తాడని అనుకున్నారు. ఇదొక్కటే కాదు. అర్థం పర్థంలేని చాలా పుకార్లు చెక్కర్లు కొట్టాయి. 
ఇసుకే కారణం? 
ఎడారి ఇసుక ఈ వర్షపు నీటిలో కలిసిందని కూడా చాలామంది చెప్పారు. కానీ.. దానికి కూడా సరైన రుజువులు చూపించలేకపోయారు. మామూలుగా రుతుపవనాల టైంలో వీచే సుడిగాలుల వల్ల  వర్షంతోపాటు అప్పుడప్పుడు చేపలు పడతాయి. కానీ.. ఇసుక పడడం అంత ఈజీ కాదు. ఎడారిలో ఉండే ఇసుక పైకి ఎగిరి వర్షపు నీటిలో కలిసింది అని నిరూపించడానికి ఎలాంటి ఆధారాల్లేవు. 
ఉల్క పేలిందా? 
కొందరు సైంటిస్ట్‌‌లు ఆకాశంలో ఉల్క పేలి, చిన్న చిన్న రేణువులుగా మారి, అవి భూ వాతావరణంలో కలిశాయని చెప్పారు. ఆ రేణువులే వర్షం కురిసినప్పుడు నీటిలో కలసి, నీటి రంగును ఎర్రగా మార్చి భూమికి చేర్చాయని వాదించారు. కానీ.. ఈ వాదనలకు కూడా పెద్దగా రుజువులు చూపించలేకపోయారు. 
మాంసపు వర్షం
ఇలాంటి వర్షాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా వింత వర్షాలు కురిశాయి. కాకపోతే దాదాపు అన్నింటికీ కారణాలు తెలుసుకోగలిగారు. ఈ రక్తపు వర్షం మాత్రమే మిస్టరీగా ఉండిపోయింది. కొన్నేళ్ల క్రితం  అనంతపురం జిల్లాలోని గుత్తిలో కప్పల వర్షం కురిసింది. 1876లో అమెరికాలోని బాత్ కౌంటీలోని కెంటకీ ప్రాంతంలో వర్షం కురిసినప్పుడు అందులో మాంసం ముద్దలు పడ్డాయి. సైంటిస్ట్‌‌లు ఇది రాబందుల వల్ల కురిసిందని తేల్చి చెప్పారు. రాబందులు మాంసం తిన్న తర్వాత జీర్ణం కాకపోతే బయటకు ఊసేస్తాయని ఆ మాంసం సుడి గుండాల వల్ల మేఘాల్లోకి చేరిందని చెప్పారు. 2015లో ఇడాహో, ఒరెగాన్, వాషింగ్టన్‌‌లలో పాల వర్షం కురిసింది. అలాగే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసినప్పుడు ఆకాశం నుంచి పాములు, కీటకాలు, రాళ్లు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. ఈ వర్షాలన్నింటికీ సుడిగుండాలే కారణం. కానీ.. రక్తపు వర్షానికి సుడిగుండాలకు ఎలాంటి సంబంధం లేదు. 
కొత్తేమీ కాదు
కేరళలో ఇంతకుముందు కూడా ఇలాంటి వింత వర్షాలు పడ్డాయి. 1896లో మొట్ట మొద‌‌ట‌‌గా ఒక చోట కాస్త ఎరుపు వ‌‌ర్షం ప‌‌డింద‌‌ని ఇక్కడివాళ్లు చెప్తున్నారు. 1957 జూలై 15 తర్వాత అప్పుడప్పుడు కాస్త పసుపు రంగులో వర్షం పడింది. కానీ.. పూర్తిగా ఎర్ర రంగులో పడడం మాత్రం  ఇదే మొదటిసారి. 
ఆ నీళ్లలో ఏముంది? 
ఆ నీళ్ల రహస్యం ఏంటో తెలుసుకునేందుకు కేరళలోని ‘సెంటర్‌‌ ఫర్‌‌ ఎర్త్‌‌ సైన్స్‌‌ స్టడీస్‌‌ ఆర్గనైజేషన్‌‌’ రంగంలోకి దిగింది. ఆ నీళ్లని అనేక రకాలుగా టెస్ట్‌‌ చేసి, అది రక్తం కాదని తేల్చింది. ప్రతి మిల్లీలీటర్ వర్షంలో సుమారు  తొమ్మిది మిలియన్ల ఎర్ర కణాలు ఉన్నాయి. కానీ.. అవి ఎక్కడినుంచి వచ్చాయనేది తెలుసుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఆ నీళ్లు ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, ఆ నీటిలో కొన్ని ఆకుపచ్చ, నీలం బూడిద, పసుపు రంగుల కణాలు కూడా ఉన్నాయి. పీహెచ్‌‌ విలువలో ఎలాంటి మార్పు లేదు. వర్షపు నీటికి ఉండాల్సినంతే ఉంది. మరెందుకు ఈ నీరు ఎర్రగా మారింది? సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ ఈ నీటిలో పెద్ద మొత్తంలో నికెల్, మాంగనీస్, టైటానియం, క్రోమియం, రాగి ఉన్నట్లు కనుగొన్నారు. కానీ.. అవి ఉన్నా నీళ్లు ఎర్రగా మారడానికి  అవే కారణమని కచ్చితంగా చెప్పలేకపోయారు. ఇలా.. ఆ నీటి మీద కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిగాయి. చివరకు 2013లో ఆ నీటిలో విచిత్రమైన జీవ కణాలను కనుగొన్నారు. ‘ట్రెంటెపోహ్లియా అన్యులాటా’ జాతికి చెందిన నాచులాంటి పదార్థం అందులో ఉందన్నారు. ఇది మామూలుగా చెట్ల బెరడుపై పెరుగుతుంది. అంతేకాదు.. ఈ జీవ కణాలు అసలు మన దేశంలో ఎక్కడా లేవు? కేవలం ఆస్ట్రియాలో మాత్రమే ఇవి పెరుగుతాయి. మరి ఇక్కడికెలా వచ్చాయి? ఈ నీళ్లలో ఎలా కలిశాయి? అనే దానిపై అనేక సిద్ధాంతాలు చెప్తున్నా.. ఒక్కదానికీ సరైన ఆధారాల్లేవు.                                                                                                                                                                               -::: కరుణాకర్​ మానెగాళ్ల