పోలీస్ ఇంటికే కన్నం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోనూ చోరీ

పోలీస్ ఇంటికే కన్నం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి  ఇంట్లోనూ చోరీ
  • చందానగర్​లో ఒకేసారి రెండు ఘటనలు

చందానగర్, వెలుగు: చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఒకేసారి రెండు చోరీలు జరిగాయి. ఓ పోలీస్​ ఇంటితో పాటు రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే... చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్ విహార్​లో నివాసముండే విజయ్‌‌‌‌కుమార్  మియాపూర్ పోలీస్​ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వెళ్లేసరికి 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు చోరీకి గురయ్యాయి. మరో ఘటనలో చందానగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీలో రిటైర్డ్ ఉద్యోగి సీతారామ్మూర్తి ఇంట్లో దొంగతనం జరిగింది. గత నెల 29న ఆయన కుటుంబం సత్యసాయిబాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లింది. తిరిగి ఆదివారం రాత్రి వచ్చేసరికి ఇంట్లో 18 తులాల బంగారం, 60 తులాల వెండి, కొంత నగదు చోరీ అయ్యాయి. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చందానగర్​లో వరుసగా చోరీలు జరగడం భయాందోళన కలిగిస్తోంది.