
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి దళిత బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు సుందిళ్ల బ్యారేజ్‌లో శవమై తేలాడు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించి, హత్య చేశాడని బాలిక పేరెంట్స్సహా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా.. నిందితుడు శవంగా మారడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగాంబాల బస్తీకి చెందిన బాలిక(17) అమ్మమ్మ వద్ద ఉంటోంది. బెల్లంపల్లిలోనే రామ్‌నగర్‌కు చెందిన సాజిద్(20)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాలిక పేరెంట్స్ హైదరాబాద్‌లో ఉండగా.. ఆమె వాళ్ల వద్ద ఉంటూ.. మొన్నటి దాకా ఓ కాల్సెంటర్లో పని చేసేది. ఈ నెల12న ఉదయం జాబ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన బాలిక.. అదే రోజు సాయంత్రం సాజిద్‌ను పెళ్లి చేసుకున్నట్లు, అతనితోపాటే ఉంటానని పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో పేరెంట్స్ మల్కాజ్గిరి పీఎస్‌లో మిస్సింగ్ కేసు పెడుతూ.. సాజిద్‌పై అనుమానమున్నట్లు చెప్పారు. పోలీసులు వారి కోసం గాలిస్తుండగా.. ఈ నెల16న జైపూర్ మండలం బెజ్జాల దగ్గర గోదావరి ఒడ్డున బాలిక శవం దొరికింది. సాజిద్ ప్రేమ పేరుతో వేధించి బాలికను రేప్ చేసి చంపాడని, అతడే శవాన్ని గోదావరి లో పడేశాడని ఆమె పేరెంట్స్సహా దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుండగానే.. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజ్ లో సాజిద్ మృతదేహం కనిపించింది. బాలికను చంపి సాజిద్ కూడా అదేరోజు చనిపోయాడా, పట్టుకుంటారన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు బాలిక, సాజిద్ల ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు.