
- పోలీసుల అదుపులో మరో నిందితుడు
జగిత్యాల, వెలుగు: మెటా ఫండ్ కంపెనీ పేరుతో క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన ఘటనలో కొడిమ్యాల పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. మూడు నెలల్లో మూడు రెట్లు డబ్బులు వస్తాయంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామానికి చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, వీరబత్తిని రాజు పలువురి నుంచి లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టించినట్లు సమాచారం.
గత ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన మెటా ఫండ్ క్రిప్టో కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించి, ఆ తరువాత లాభాలు ఇవ్వకపోవడంతో బాధితులు కొడిమ్యాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మెటా ఫండ్ క్రిప్టో పేరుతో మోసం చేసిన ఘటనలో జగిత్యాలకు చెందిన ఫొటోగ్రాఫర్ రాకేశ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న పరిచయాలతో జిల్లాలోని ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగిత్యాలలోని సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.