నీటి గుంటలో పడి ఇద్దరు పిల్లలు మృతి

నీటి గుంటలో పడి ఇద్దరు పిల్లలు మృతి
  •   బర్లు మేపడానికి వెళ్లిన ఇద్దరు మైనర్​ స్నేహితులు
  •     ప్రభుత్వ స్థలంలో మట్టి తోడడంతో అందులో పడి మృత్యువాత  
  •     సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్ల కుంటలో ఘటన
  •     బర్లు మేపడానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు 
  •     ప్రభుత్వ స్థలంలో మట్టి తోడడంతో గమనించకుండా పడ్డ మైనర్లు 


కోదాడ, వెలుగు : ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి కోసం తవ్విన గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కోదాడ మండలం రెడ్ల కుంట గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం..రెడ్ల కుంటకు చెందిన చిర్రా తిరపయ్య, సునీత దంపతులు బర్లు మేపుకుంటూ బతుకుతున్నారు. వీరికి  ఇద్దరు పిల్లలుండగా చిర్రా ఉపేందర్ కోదాడలోని ప్రభుత్వ హాస్టల్​లో ఉంటూ హైస్కూల్​లో ఏడో తరగతి చదువుతున్నాడు. జ్వరం రావడంతో కొద్ది రోజుల కిందటే ఊరికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన  పోలంపల్లి స్వామి, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా, పెద్ద కొడుకైన అనిల్ కుమార్ అలియాస్ వినయ్ (13) కాపుగల్లులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

అనిల్, ఉపేందర్​ ఫ్రెండ్స్​ కావడంతో అనిల్ కు సంబంధించిన బర్లు కాయడానికి బుధవారం గ్రామ శివారులోకి వెళ్లారు. అక్కడ అప్పటికే మట్టి కోసం తీసిన గుంతలు ఉన్నాయి. అందులో వర్షపు నీరు చేరడంతో  గమనించని అనిల్, ఉపేందర్​ బర్లు  మేపుకుంటూ వెళ్లి అందులో పడి మునిగి చనిపోయారు. అనిల్ తల్లి అన్నపూర్ణ  అనిల్ ను ఇంటికి పంపిద్దామని బర్ల వద్దకు వెతుక్కుంటూ వచ్చింది. బర్లు ఉన్నా పిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడి వెతికింది. దీంతో మట్టిగుంత వద్ద చెప్పులు కనిపించడంతో కేకలు వేస్తూ గ్రామస్తులను పిలిచింది. వారు వచ్చి దిగి చూడగా పిల్లల మృతదేహాలు కనిపించాయి. దీంతో బయటకు తీశారు. ప్రభుత్వ స్థలంలో కొంతమంది అక్రమార్కులు మట్టి తవ్వుకుపోవడంతో గుంతలు ఏర్పడి ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. కాగా ఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని, చేస్తే చర్యలు తీసుకుంటామని రూరల్ పోలీసులు తెలిపారు.