ఆప్​లో చేరిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు

ఆప్​లో చేరిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్​ కార్పొరేషన్​ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్​ కౌన్సిలర్లతో పాటు ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆమ్ ​ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ సొంత గూటికి వచ్చారు. ముస్తఫాబాద్‌‌‌‌ వార్డు నుంచి గెలిచిన సబీలా బేగం, బ్రిజ్‌‌‌‌పురి వార్డునుంచి గెలిచిన నజియా ఖాటూన్‌‌‌‌, అలాగే, ముస్తఫాబాద్‌‌‌‌ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్​ పార్టీ నేత అలీ మెహదీ శుక్రవారం ఆమ్​ ఆద్మీ పార్టీలో చేరారు.

అయితే, వీరి చేరికను వ్యతిరేకిస్తూ ముస్తఫాబాద్‌‌‌‌ లో కొందరు ఆందోళనకు దిగారు. అలీ మెహదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో, కొన్ని గంటల తర్వాత మోహదీతో పాటు ఆ ఇద్దరు కౌన్సిలర్లు మళ్లీ కాంగ్రెస్​ పార్టీలోకి వచ్చారు. అనంతరం మెహదీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. తాను కాంగ్రెస్​కు, రాహుల్ గాంధీకి లాయల్​ వర్కర్​నని పేర్కొన్నాడు. తాను ఆప్‌‌‌‌లోకి వెళ్లి తప్పు చేశానని, తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో తాను ఆప్​లో చేరానని, కానీ ఇది మూర్ఖపు చర్య అని పేర్కొన్నారు. మైనారిటీ సమస్యలపై ఆప్‌‌‌‌ నేతల వైఖరి కూడా మారలేదన్నారు. "నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పును అంగీకరిస్తున్నాను. నేను రాహుల్​ను, కాంగ్రెస్‌‌‌‌ను విడిచిపెట్టను. రాహుల్​ను చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను" అని మెహదీ వీడియోలో పేర్కొన్నాడు.