- సీఐడీ, గ్రేటర్ పోలీసులకు రెండు రోజుల ట్రైనింగ్
హైదరాబాద్, వెలుగు: ఆర్థికపరమైన మోసాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ఫోరెన్సిక్ అంశంపై ఐసీఏఐ-డీఏఏబీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా- న్యూ ఢిల్లీ డిజిటల్ అకౌంటింగ్ అండ్ అష్యూరెన్స్ బోర్డు) ఆధ్వర్యంలో రెండ్రోజు పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సీఐడీ, గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులకు గురువారం శిక్షణ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఐసీఏఐ భవన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో సీఐడీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన మొత్తం 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ ర్యాంకుల అధికారులు ట్రైనింగ్‌లో ఉన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలో తొలిసారిగా నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో ఆర్థిక మోసాల కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, తాజా డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా తెలిపారు. ఆర్థిక నేరాల దర్యాప్తులో పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నారు.
