
హైదరాబాద్ ఫిర్జాదిగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్ఎస్ఎస్ సంఘ్ క్షేత్ర పరివార్ సమావేశం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు సంఘ్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ ముకుందా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలిరోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీతో కలిసి పనిచేయడంపై నేతలు చర్చించారు. హిందుత్వ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో బీజేపీ సహకారాన్ని తీసుకోవడం, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో హిందుత్వకు ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉంది.. ఆ పార్టీల బారి నుంచి హిందూ సమాజాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
సోమవారం నాటి సమావేశంలో రాష్ట్రంలో సంఘ్ పరిస్థితి, ఈ మధ్యకాలంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో తెలంగాణలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చ సాగనుంది. రేపటితో ఈ సమావేశాలు ముగియనున్నాయి.