ఓరుగల్లులో రెండు రోజులు సద్దులబతుకమ్మ సంబరాలు.. సోమవారం హనుమకొండలో..మంగళవారం వరంగల్‍ లో..

ఓరుగల్లులో రెండు రోజులు సద్దులబతుకమ్మ సంబరాలు.. సోమవారం హనుమకొండలో..మంగళవారం వరంగల్‍ లో..
  • అర్చకుల మధ్య వర్గపోరుతో గందరగోళం 

వరంగల్, వెలుగు: రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఓరుగల్లు పేరొందింది. సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి. హనుమకొండలోని పద్మాక్షి గుడి, వరంగల్‍లోని ఉర్సు రంగలీల మైదానంలో వేలాది మంది మహిళలతో బతుకమ్మ సందడి నెలకొంటుంది.  

ప్రముఖ  వేద పండితులు, అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి మీడియాలో వేర్వేరు తేదీలు ప్రకటించడంతో  రెండు రోజుల పాటు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. సోమవారం హనుమకొండ పద్మాక్షి గుండం వద్ద మహిళలు భారీగా వేడుకలు  నిర్వహించారు. మంగళవారం ఉర్సు రంగలీల మైదానంలో వరంగల్​మహిళలు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఇందుకు పండితుల మధ్య వర్గపోరే కారణమని తెలిసింది. 

వరంగల్ లో భద్రకాళి ఆలయం, వెయ్యిస్తంభాల గుడి, పద్మాక్షి, సిద్ధేశ్వరతో పాటు ఊకల్‍ నాగేంద్రస్వామి  ఆలయాల్లోని అర్చకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఏదైనా పండుగ వచ్చిందంటే ఎవరికివారే వేర్వేరుగా వేడుకల తేదీలను ప్రకటిస్తుంటారు.సద్దుల బతుకమ్మ పండుగ విషయంలోనూ అర్చకులు పోటీపడ్డారు. 

కొందరు సోమవారం, ఇంకొందరు మంగళవారం చేసుకోవాలని వేర్వేరు ప్రకటనలు చేశారు. ఇదికాస్తా  గందరగోళానికి దారితీయగా, మహిళలు రెండు రోజులు నిర్వహించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం వేడుకలు జరుపుకోవాలని తెలిపింది. కొందరు అర్చకులు మాత్రం సోమవారం చేసుకోవాలని చెప్పడంతో  రెండు రోజులు చేశారు.