న్యూయార్క్ను ముంచెత్తిన వాన

న్యూయార్క్ను ముంచెత్తిన వాన

న్యూయార్క్: అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపై భారీగా వరద చేరి, వాహనాలు చిక్కుకుపోయాయి. సబ్‌‌‌‌వే రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో న్యూజెర్సీలో అధికారులు అత్యవసర పరిస్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 

మంగళవారం ఉదయం వర్షం తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు ముప్పు తగ్గింది. కానీ, ఇంకా కొన్ని రోడ్లు, వీధులు నీళ్లల్లోనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు. 

న్యూజెర్సీలో వరదలతో నిండిన నార్త్ ప్లెయిన్‌‌‌‌ఫీల్డ్ ప్రాంతంలో ఒక ఇల్లు మంటల్లో కాలిపోయింది. ఆ ఇంట్లోని వారిని అధికారులు ఖాళీ చేయించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్నేయ పెన్సిల్వేనియాలోని మౌంట్ జాయ్  ప్రాంతంలో సోమవారం 5 గంటల్లో 17.8 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షం పడింది. 

న్యూయార్క్ సిటీలోని సబ్‌‌‌‌వే స్టేషన్లు, రైలు ట్రాక్‌‌‌‌లు మునిగిపోవడంతో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ అథారిటీ (ఎంటీఏ) కొన్ని సర్వీసులను నిలిపివేసింది.