కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడి జనం అక్కడే ఉండిపోయారు. ఉద్యోగాల కోసం వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్లు.. తమ కుటుంబ సభ్యులను , స్నేహితులను నేరుగా కలవలేక.. వీడియో కాల్ ద్వారానే ఒకరినొకరు పలకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయితే మనుషులు మాత్రమే ఇలా వీడియో కాల్ చేసుకుంటున్నారని అనుకుంటే, అది మన పొరపాటే. ఎందుకంటే ఐర్లాండ్‌లో రెండు పెంపుడు కుక్కలు జూమ్ కాల్ ద్వారా ఒకరినొకరు పలకరించుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జెరెమీ హోవార్డ్ అనే వ్యక్తి లాక్‌డౌన్‌కు ముందు తన పెంపుడు కుక్క లైకాను షికారు కోసం బయటికి తీసుకెళ్లేవాడు. అలా వెళ్లినప్పుడు మరో వ్యక్తి పెంపుడు కుక్క హెన్రీ తో సయ్యాటలాడేది. వైరస్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవడంతో మనుషులతో పాటు అవి కూడా ఇళ్లల్లోనే బందీలయ్యాయి.
లాక్‌డౌన్ వల్ల ఇంట్లో బోర్ ఫీలవుతుందని లైకా యజమాని జెరెమీ హోవార్డ్ ఓ ఐడియా వేశాడు. వీడియో కాల్‌తో లైకాను సర్‌ప్రైజ్ చేశాడు. లైకా, హెన్రీల మద్య జూమ్ కాల్ ఏర్పాటు చేశాడు. చాలా రోజుల తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ని చూడడంతో లైకా అరుస్తూ ముచ్చటించింది. అటువైపున్న హెన్రీ కూడా చాలా రోజులకు స్నేహితుడిని చూసి సంతోషంతో గదిలో గెంతులు వేసింది
భౌ భౌ అంటూ …. మాట్లాడుకుంటున్న ఆ సంఘటనను హోవార్డ్ తన కెమెరాల్లో బంధించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు . ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాపం అవి కూడా తమ చిన్న చిన్న ఆనందాలను ఎంతగా మిస్ అవుతున్నాయోననని అంటున్నారు.
