వానలకు పంట దెబ్బతినడంతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

వానలకు పంట దెబ్బతినడంతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

చిట్యాల/మొగుళ్లపల్లి, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బ తినడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని ఏలేటిరామయ్యపల్లికి చెందిన ఉమ్మనవేని ఎల్లయ్య(62) తనకున్న 6 ఎకరాలతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా పత్తి, మిర్చి సాగు చేస్తున్నాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రూ.8లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది మంచిగా పండితే తీర్చేద్దామనుకుని మరోసారి పత్తి, మిర్చి పంటలు వేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లయ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బుధవారం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన చుట్టు పక్కల రైతులు చిట్యాల గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే ఎల్లయ్య చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని భార్య రాధమ్మ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రాధమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు ఫైల్​చేశారు. 

ఇస్సిపేటలో మరొకరు..
మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన పండుగ చిన్న రాజయ్య(60) తనకున్న మూడెకరాలతోపాటు పక్క గ్రామమైన హైబత్​పల్లిలో రెండేళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, వరి వేస్తున్నాడు. పెట్టుబడి కోసం భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు, బయట మరో రూ.8 లక్షలు అప్పు తెచ్చాడు. గతేడాది దిగుబడి రాకపోవడంతో అప్పు అలాగే ఉంది. ఈ ఏడాది దిగుబడి వస్తే తీర్చేద్దామనుకుని రాజయ్య మరోసారి పత్తి, వరి, మిర్చి పంటలు వేశాడు. ఇటీవల కురిసిన వానలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటే లేకపోతే అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో రాజయ్య మంగళవారం అర్ధరాత్రి అంతా నిద్రపోయాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజయ్య భార్య సరోజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమాదేవి చెప్పారు. మృతునికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
 

మహిళా రైతు ఆత్మహత్యా యత్నం
మోర్తాడ్: వరద నీటిలో పంట కొట్టుకుపోయిందని నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించింది. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన నాగమణి తనకున్న ఎకరన్నర పొలంలో వరి నాటింది. రెండు రోజుల కింద కురిసిన భారీ వర్షానికి వరద వచ్చి, నాగమణి పొలం మీదుగా పారింది. పంట మొత్తం కొట్టుకుపోయింది. బుధవారం చేనుకెళ్లిన నాగమణి జరిగింది చూసి కన్నీరు మున్నీరైంది. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగబోయింది. అక్కడే ఉన్న గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు. రూ.75వేలు పెట్టుబడి పెట్టానని బాధితురాలు వాపోయింది.