అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఎల్కతుర్తి/కల్వకుర్తి, వెలుగు: హనుమకొండ, నాగర్​కర్నూల్ జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్​పూర్​కు చెందిన పెండ్యాల మధుకర్ (35)కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఒకటిన్నర ఎకరంలో వరి, ఎకరంలో పత్తి వేశాడు. ఖాళీ టైమ్​లో డ్రైవర్​గా పని చేసేవాడు. ఈ క్రమంలో పెట్టుబడి కోసం మూడు లక్షల వరకు అప్పు చేశాడు. వడగండ్ల వాన కారణంగా పంట మొత్తం దెబ్బతిన్నది. ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి కూడా గొడవ జరిగింది. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. 

ఓ రైతు పొలంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి హాస్పిటల్​కు తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం హుజురాబాద్ ఏరియా హాస్పిటల్​కు తీసుకెళ్లారు. మధుకర్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్​ఐ గోదారి రాజ్​కుమార్ తెలిపారు. అదేవిధంగా, నాగర్​కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన దయ్యాల శ్రీశైలం (35) ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు అంతంత మాత్రంగానే పడటంతో పంట దిగుబడి రాదని పొలంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా చనిపోయాడు. మూడున్నర లక్షల వరకు అప్పు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లెనిన్ తెలిపారు.