కలుషిత నీళ్లు తాగి.. ఇద్దరు మృతి

కలుషిత నీళ్లు తాగి.. ఇద్దరు మృతి

హైదరాబాద్/శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలోని మొగల్​కాలనీలో కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. మరికొంత మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగడంతోనే అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. వారం కింద కొందరు అనారోగ్యంతో హాస్పిటల్​లో చేరారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ కైసర్​ఖాన్​(28), బుధవారం ఆఫ్రిన్​ సుల్తానా (22) చనిపోయారు. అదే ఏరియాకు చెందిన ఆర్పీ సింగ్, షహజాది బేగం, అజహరుద్దీన్, సమ్రీన్ బేగం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండేండ్ల ఇత్తెషాముద్దీన్, ఇఖ్రాబేగం కూడా అనారోగ్యం పాలయ్యారు. చనిపోయిన ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజా బేగం (6నెలలు) హెల్త్​ క్రిటికల్​గా ఉంది. మొత్తం 10 మందికి పైగా స్థానికులు ప్రైవేట్​ హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు కాలనీలో ఆందోళనకు దిగారు. కలుషిత నీరు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు నీళ్లను టెస్ట్​ చేసి అంతా నార్మల్​గానే ఉందని ప్రకటించారు. నీరు కలుషితం కాలేదని తెలిపారు. మరిన్ని టెస్టుల కోసం శాంపిల్స్​ సేకరించి ల్యాబ్​కు పంపించామన్నారు.  

నెల రోజుల్లో రెండు సార్లు ఫిర్యాదు

మాదాపూర్​లోని గుట్టలబేగంపేట్ ఘటన మరువక ముందే మైలార్ దేవ్ పల్లిలోని మొఘల్ కాలనీలో నీరు కలుషితమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల్లో రెండు సార్లు జలమండలికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఇద్దరు చనిపోయాక ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నారన్నారు. 10 రోజుల కింద కలుషిత నీరు సరఫరా అయితే.. అధికారులు ఇప్పుడు సప్లై అవుతున్న నీటిని టెస్ట్​ చేసి బాగుందని చెప్పడం సరికాదని మండిపడ్డారు. 

రిపోర్టు వచ్చాక చెబుతాం

కలుషిత నీరు సప్లై అయితే తాగిన వారం దరు అస్వస్థతకు గురయ్యే చాన్స్ ఉంది. కానీ, కేవలం 10 మంది మాత్రమే బీమార్ అయిన్రు. ఇప్పటికైతే వాటర్ పొల్యూషన్ జరగలేదని గుర్తించాం. మరిన్ని శాంపిల్స్ ల్యాబ్​కు పంపినం. రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు చెబుతాం. ఫుడ్ పాయిజన్​ కారణంగా అస్వస్థతకు గురయ్యారా.. అన్న కోణంలోనూ వివరాలు తెలుసుకుంటున్నాం.
- డాక్టర్ వెంకటేశ్వర్ రావు, రంగారెడ్ది జిల్లా డీఎంహెచ్ వో

కలుషిత నీరే కారణం

15 రోజుల కింద సప్లై అయిన కలుషిత నీరు కారణంగానే అస్వస్థతకు గురయ్యాను. ఈ నీళ్లు తాగడంతో నా కొడుకు కూడా బీమార్ అయిండు. గలీజ్ నీళ్లు సప్లై అవుతున్నాయని జలమండలి సార్లకు కంప్లైంట్​ చేసినా పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు చనిపోయారు. ఇంకా చాలా మంది హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నరు. 
- సోనీ, స్థానిక మహిళ

నీళ్లు కలుషితం కాలేదు

మైలార్ దేవ్ పల్లిలో నీళ్లు కలుషితం కాలేదు. నీళ్ల కారణంగానే ఇద్దరు చనిపోయారని ఆరోపణలు రావడంతో అన్ని టెస్టులు చేశాం. అంతా నార్మల్ గానే ఉంది. ఎప్పుడో వారం కింద హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారు ఇతర కారణాలతో మరణించి ఉంటారు. నీళ్లు కలుషితం అయితే కాలేదు. ఒకవేళ అయి ఉంటే ఆ నీళ్లు తాగినవారందరూ అస్వస్థతకు గురి కావాల్సి ఉన్నా.. అలా జరగలేదు. 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- దాన కిశోర్, జల మండలి ఎండీ