
సంగారెడ్డి, వెలుగు: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్, ఎరిక్ సన్ సీటీవో తాటిపాముల మల్లికార్జున్ అత్యంత గౌరవప్రద రాయల్ సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ ఫెలోస్(ఎఫ్ఆర్ఎస్)గా ఎన్నికయ్యారు.
బుధవారం (May 21) మీడియా సమావేశంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వివరాలు తెలిపారు. గణితం, ఇంజనీరింగ్ సైన్స్ తోపాటు వైద్య శాస్త్రాలతో సహా సహజ జ్ఞానాన్ని మెరుగు పరచడంలో విశిష్ట సేవలు అందించినవారికి ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కుతుందన్నారు. ప్రొఫెసర్ జగదీశ్సెమీకండక్టర్ నానో టెక్నాలజీ, ఫోటోనిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌లో ప్రసిద్ధి చెందారు.
ఏపీలోని వల్లూరుపాలెంలో జన్మించి, తెలంగాణలోని అరెకాయలపాడు గ్రామంలో పెరిగి తన పరిజ్ఞానంతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించారన్నారు. అలాగే.. మల్లికార్జున్ తాటిపాముల 5జి, తర్వాతి తరం నెట్‌వర్క్ అభివృద్ధిలో విశేషమైన పాత్ర పోషించారన్నారు. వరంగల్‌లో జన్మించిన ఆయన టెలి కమ్యూనికేషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారన్నారు.
ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు ఫెలోస్ ఆఫ్ ది రాయల్ సొసైటీలో చేరడం ఐఐటీహెచ్ కు గర్వకారణమని డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఈ సమావేశం అనంతరం విదేశాల్లో ఉన్న ప్రొఫెసర్లు జగదీశ్, మల్లికార్జున్ తమ అనుభవాలు పంచుకున్నారు.