నాగోల్​లో కలకలం..నగల బ్యాగ్​తో పరార్​.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నాగోల్​లో కలకలం..నగల బ్యాగ్​తో పరార్​.. ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని నాగోల్‌‌లో దారుణం జరిగింది. బంగారం దుకాణంలో దుండగులు కాల్పులు జరిపి, నగలు ఎత్తుకెళ్లారు. నాగోల్​లోని స్నేహపురి కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పాట్​లో నాలుగు బుల్లెట్స్‌‌ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజస్థాన్‌‌‌‌కు చెందిన కల్యాణ్‌‌‌‌ చౌదరి(34) స్నేహపురి కాలనీలో మహదేవ్ జ్యువెలర్స్ పేరుతో గోల్డ్‌‌‌‌ షాప్ నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాద్‌‌‌‌లోని వర్క్​షాప్ నుంచి గోల్డ్‌‌‌‌ కొనుగోలు చేస్తున్నాడు. వర్క్​షాప్ ఉద్యోగి సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌ (25) గురువారం రాత్రి బంగారు నగలతో నాగోల్‌‌‌‌ వచ్చాడు. ఆ టైమ్ లో ఆయనను రెండు పల్సర్‌‌‌‌‌‌‌‌ బైకులపై నలుగురు దుండగులు వెంబడించారు. సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌.. కల్యాణ్​కు చెందిన షాప్‌‌‌‌ లోపలికి వెళ్లడం, షాపులో ఓనర్ తప్ప కస్టమర్లు లేకపోవడం గుర్తించారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు షాప్ లోకి వెళ్లి షట్టర్‌‌‌‌‌‌‌‌ వేశారు.

మరో ఇద్దరు రోడ్డుపైనే ఉండి గమనించారు. లోపలికి వెళ్లిన వ్యక్తులు కల్యాణ్‌‌‌‌ చౌదరి, సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌పై తుపాకీ గురి పెట్టారు. బంగారు ఆభరణాల బ్యాగు ఇవ్వాలని బెదిరించారు. అయితే అందుకు నిరాకరించడంతో కల్యాణ్‌‌‌‌ చౌదరి, సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌పై కంట్రీమేడ్‌‌‌‌ రివాల్వర్‌‌‌‌‌‌‌‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కల్యాణ్‌‌‌‌ ముఖం పైనుంచి బుల్లెట్‌‌‌‌ దూసుకెళ్లింది. సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌ ఎడమ చెవి, ఎడమ భుజం, కాలులోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. లోపలి నుంచి శబ్దాలు, అరుపులు రావడంతో స్థానికులు షాప్‌‌‌‌ వద్దకు వచ్చారు. షాప్‌‌‌‌ షట్టర్‌‌‌‌‌‌‌‌ ఎత్తారు. లోపలి నుంచి బయటకు వచ్చిన దుండగులు.. స్థానికులను తుపాకీతో బెదిరించి నగల బ్యాగుతో బైక్‌‌‌‌పై పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వాళ్ల పనా? లేక యూపీ, బీహార్ గ్యాంగ్‌‌‌‌లు దోపిడీకి పాల్పడ్డాయా? అనే కోణంలో విచారిస్తున్నారు.