
- కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రా రెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిగా గుర్తింపు
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మఢ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు ఉన్నాయన్న సమాచారం అందడంతో ఎస్పీ రాబిన్సన్ఆధ్వర్యంలో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, బలగాలు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు ప్రారంభం అయ్యాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. అనంతరం ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. ఇద్దరు మావోయిస్టులు డెడ్‌బాడీలు కనిపించాయి.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఏకే 47, ఇన్సాస్ తుపాకీ, బీజీఎల్ లాంచర్, పేలుడు పదార్థాలు, విప్లవసాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారిని కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజూ దాదా అలియాస్గుడ్సా ఉసెండీ అలియాస్ విజయ్అలియాస్ వికల్ప్ (63), కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్కోసా అలియాస్ గోపన్న అలియాస్ బుచ్చన్న (67)గా గుర్తించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరిపై రూ. కోటి చొప్పున రివార్డు ఉందని ఐజీ తెలిపారు.
43 ఏండ్లుగా అజ్ఞాతవాసం
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం గోపాల్‌రావుపల్లికి చెందిన సత్యనారాయణరెడ్డి 43 ఏండ్ల మావోయిస్ట్ ప్రస్థానం ముగిసింది. అన్నమ్మ, కృష్ణారెడ్డి దంపతుల రెండో కుమారుడైన సత్య నారాయణ రెడ్డి పదిహేనేండ్ల వయస్సులోనే మావోయిస్టుల్లో చేరి సోమవారం చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. 15 సంవత్సరాల క్రితం తండ్రి, ఐదేండ్ల కింద తల్లి చనిపోయినా కడసారి చూపునకు కూడా రాలేదు. సత్య నారాయణ రెడ్డి అన్న కరుణాకర్‌రెడ్డి ఎంఈవోగా పని చేసి రిటైర్ అయ్యారు.