- 15 రోజుల్లో ఏడు ఘటనలు
సివాన్: బిహార్లో మరో రెండు బ్రిడ్జీలు కూలిపోయాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సివాన్ జిల్లాలోని రెండు బ్రిడ్జీలు కూలిపోయాయని అధికారులు బుధవారం తెలిపారు. అవి రెండు కూడా 20 ఏండ్ల కింద కట్టినవని చెప్పారు. ఒకటి రూ.6 లక్షలతో 1998లో నిర్మించగా, మరొకటి రూ.10 లక్షలతో 2004లో నిర్మించినట్టు పేర్కొన్నారు. అయితే అప్పటి నుంచి ఆ బ్రిడ్జీలకు రిపేర్లు చేయలేదు.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గండకీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నదని, వరద వల్లనే బ్రిడ్జీలు కూలిపోయి ఉంటాయని స్థానికులు పేర్కొన్నారు. కాగా, బిహార్ లో గత కొన్ని రోజులుగా వరుసగా బ్రిడ్జీలు కూలిపోతున్నాయి. గత 15 రోజుల్లో ఇది ఏడో ఘటన. ఇంతకుముందు మధుబనీ, అరారియా, ఈస్ట్ చంపారన్, కిషన్ గంజ్ తో పాటు సివాన్ జిల్లాలోనూ బ్రిడ్జీలు కూలిపోయాయి.
