మరో రెండ్రోజులు వర్షాలు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్

మరో రెండ్రోజులు వర్షాలు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్

భాగ్యనగరం మళ్లీ తడిసి ముద్దైంది. సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడింది. వర్షాలతో రోడ్లపై వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండు రోజులు వర్షాలుంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ అయ్యింది బల్దియా. అత్యవసరం ఐతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.  సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. దిల్ సుఖ్ నగర్ , సరూర్ నగర్ , కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్ , రాంనగర్ , సికింద్రాబాద్ , ముషీరాబాద్ , ఖైరతాబాద్ , పంజాగుట్ట, లక్డీకాపూల్ , చంపాపేట, సైదాబాద్ , చైతన్యపురి, ఖైరతాబాద్ , పంజాగుట్ట, లక్డీకాపూల్ , సరూర్ నగర్ , ప్యారడైజ్ , ఆల్వాల్ , తిరుమలగిరి, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, చిలకలగూడ, ధూల్ పేట, పురాన్ పూల్ , జియాగూడ, పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానపడింది.

 సికింద్రాబాద్లో అత్యధికంగా 6.4 సెం.టీ వర్షపాతం నమోదైంది. ఎల్బీనగర్లో 4.2, బేగంపేట ,కాచిగూడలో 2.7, అస్మత్ గాడ్ లో 2.6, మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లో 2.3, మలక్ పేటలో 2.2, అంబర్ పేట్, సరూర్ నగర్ 2 సెం.మీ, నారాయణగూడలో 1.9 సెం.మీ, బేగంబజార్ లో 1.8 సెం.మీ, బంసిలాల్ పేట్ లో 1.7 , లింగోజిగూడలో 1.6, రెయిన్ బజార్ ,నాగోల్ లో 1.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.

ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మలక్ పేట, ఖైరతాబాద్ , అంబర్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి ట్రాఫిక్  స్తంభించింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం పడడంతో సిటీ జనం వణికిపోయారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. సహాయం కోసం కంట్రోల్  రూంను సంప్రదించాలని చెప్పింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర అండమాన్  సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడనం మరింత బలపడి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరే అవకాశం ఉందని తెలిపారు