- కోర్టు ఆదేశాలతో పొడిగించిన బల్దియా
- ఇప్పటికే 5,905 అబ్జక్షన్స్
- మరో వెయ్యి వరకు వస్తాయనే అంచనా
- అన్నింటినీ సర్కారుకు పంపనున్న జీహెచ్ఎంసీ
- ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత కార్పొరేషన్ల విభజన
హైదరాబాద్ సిటీ, వెలుగు: వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన అభ్యంతరాల గడువును మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో గురు,శుక్రవారాల్లో కూడా సర్కిల్, జోనల్ ఆఫీసులతో పాటు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నెల 10న వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించిన గెజిట్ విడుదల కావడంతో పాటు వారం పాటు అభ్యంతరాలకు సమయం ఇచ్చారు. ఈ అంశంపై పలువురు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఈ నెల 19వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పింది.
ఇప్పటికే 5.905 అభ్యంతరాలు రాగా, మరో రెండు రోజుల టైం ఉండడంతో మరో వెయ్యి వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 19వ తేదీ వరకు వచ్చే అభ్యంతరాలు, రెండు రోజుల కింద నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వచ్చిన అబ్జక్షన్స్, సూచనలు, సలహాలను ప్రభుత్వానికి పంపనున్నారు.
ఏమేం ఉన్నాయంటే..
ఇదివరకు ఎక్కువగా వార్డుల పేర్లు మారాయని, వార్డు పేరుతో ఉన్న ప్రాంతాలు ఆ డివిజన్ లో కాకుండా పక్క డివిజన్లలోకి మార్చారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పాటు వార్డుల బౌండరీలు కూడా సరిగ్గా పెట్టలేదని, బౌండరీల హద్దులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడంలేదని కొందరు అభ్యంతరాలు తెలిపారు. మరికొందరు ఇదివరకు ఉన్న వార్డులను రెండు, మూడు, నాలుగు ముక్కలు చేశారని అబ్జక్షన్స్ఇచ్చారు. ఇలాంటి వాటిపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తుండడంతో జనాలు ఇబ్బందులు తలెత్తితే పునర్పరిశీలిస్తామని అధికారులు చెప్తున్నారు.
కేంద్రానికి పంపాల్సి ఉండటంతో...
దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలు ఇవ్వాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఎన్ని వార్డులున్నాయి? పాపులేషన్ ఎంత? అన్న వివరాలు కోరింది. ఇందుకు గాను ఈ నెల 31వరకు డెడ్ లైన్ పెట్టింది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియని జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫైనల్ చేస్తే ఆ తర్వాత అధికారికంగా వివరాలు పంపేందుకు వీలుంటుంది.
ఈ డిటెయిల్స్ఆధారంగా కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యం చేస్తే నిధుల విషయంలో నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొనే హైకోర్టు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చిందంటున్నారు.
గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది?
గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనబడుతోంది. వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించి ఫైనల్‌నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కార్పొరేషన్ ను రెండు చేయడమా లేక మూడు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత కార్పొరేషన్ల బౌండరీలు ఫిక్స్ చేసి అధికారులు, సిబ్బందిని కేటాయించి ఎన్నికలకు వెళ్తారు. రెండు కార్పొరేషన్లు చేస్తే ఒక్కో కార్పొరేషన్లో 150 డివిజన్ల చొప్పున, మూడు అయితే, ఒక కార్పొరేషన్ కు వంద డివిజన్ల చొప్పున ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదంతా పూర్తవడానికి ఏడాది పడుతుందని, అప్పుడే ఎన్నికలకి వెళ్లనున్నట్టు తెలిసింది.
