ఓల్డ్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోకి కొత్తగా రెండు మగ మాండ్రిల్స్ (కోతి జాతి జంతువులు) వచ్చి చేరాయి. సుమారు 23 నెలల వయసున్న వీటిని గురువారం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ వినయ్ కుమార్, క్యూరేటర్ వసంత కలిసి సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. జంషెడ్‌పూర్ జూ నుంచి యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద ఈ మాండ్రిల్స్ను తీసుకొచ్చారు.
వాటికి బదులుగా హైదరాబాద్ జూ నుంచి ఒక జత ఆఫ్రికన్ సింహాలను అక్కడికి పంపారు. గత నెలలోనే జూకు చేరుకున్న ఈ జంతువులను 45 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక గురువారం నుంచి ప్రజల సందర్శన కోసం అనుమతించారు. కొత్త జంతువుల చేరికతో ఈ వేసవిలో జూకి వచ్చే విజిటర్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూ డైరెక్టర్ డాక్టర్ సునీల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
