
పండుగ వేళన కరెంటు తీగల రూపంలో ప్రాణాలు తీస్తోంది మృత్యువు. రామాంతపూర్ ఘటన జరగక ముందే మరోసారి హైదరాబాద్ లో కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందడం విషాదం నింపింది. సోమవారం (ఆగస్టు 18) రాత్రి హైదరాబాద్ లో గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా కరెంటు షాక్ తో ఇద్దరు యువకులు చనిపోయారు.
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా జరిగింది ఈ ఘటన. విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో కొంతమందికి విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఒవైసీ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిల్, వికాస్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుని పరిస్థితి చాలా విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బండ్లగూడ పోలీసులు.