
- మంగళవారం ఉదయం మేకలు కాసేందుకు వెళ్లిన కొల్చారం వాసులు
- రెండు రోజుల కింద సింగూరు నుంచి నీటి విడుదల
- అప్పటి నుంచి అక్కడే ..
మెదక్ (కొల్చారం), వెలుగు : మేకలు, గొర్లు కాసేందుకు వెళ్లిన ఇద్దరు మంజీరా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. మెదక్ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన ఎల్లాపురం ఆశయ్య, పోతంశెట్టిపల్లికి చెందిన చాకలి దుర్గయ్య మంగళవారం ఉదయం 11 గంటలకు మేకలను మేపేందుకు హనుమాన్ బండల శివారులోని మంజీరా నది అవతలి వైపు ఉన్న కుర్వగడ్డకు వెళ్లారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు సోమవారం సాయంత్రం ఎత్తి నీటిని విడుదల చేశారు. హనుమాన్బండల శివారు ప్రాంతం సింగూరు ప్రాజెక్టుకు 70 కిలోమీటర్లు ఉండడంతో వీళ్లు వెళ్లినప్పుడు నీటి ప్రవాహం ఎక్కువగా లేదు. మంగళవారం సాయంత్రం వరకు వదర ఉధృతి తీవ్రమైంది. దీంతో కుర్వగడ్డ మీద ఉన్న వారు ఇంటికి తిరిగి రాలేకపోయారు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బుధవారం ఉదయం హనుమాన్బండల్ సమీపంలోని మంజీరా నది వద్దకు వెళ్లి చూడగా ఆశయ్య, దుర్గయ్య కుర్వగడ్డ మీద చిక్కుకుపోయి కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నది వెడల్పు తక్కువగా ఉన్నచోటు నుంచి అవతలి ఒడ్డున చిక్కుకున్నవారికి ఆహార పొట్లాలు, వాటర్బాటిల్స్విసిరేశారు.
మేమొస్తే గొర్లు ఆగమైతయ్
అవతలి వైపు చిక్కుకున్న ఆశయ్య, దుర్గయ్యలను పోలీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. తమ దగ్గర 130 వరకు మేకలు, గొర్లు ఉన్నాయని, తాము వస్తే అవి ఆగమవుతాయని చెప్పారు. వరద ఉధృతి తగ్గాకే వస్తామని చెప్పారు. గతంలో కూడా ఐదారు సార్లు ఇలా చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా కాపాడిన సందర్భాలున్నాయి.