క్యాతన్ పల్లి రైల్వే గేటు ఢీకొని ఇద్దరు మృతి .. బాల్క సుమన్ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ నేతల ఆందోళన

క్యాతన్ పల్లి రైల్వే గేటు ఢీకొని ఇద్దరు మృతి .. బాల్క సుమన్ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ నేతల ఆందోళన

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండలం క్యాతన్ పల్లి రైల్వే గేటు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రామకృష్ణాపూర్ సుభాష్​ నగర్ కాలనీకు చెందిన భూక్యా సురేష్​ (30), కుంబాల చందు(35) అనే ఇద్దరు బైక్ పై రైల్వే గేటు దాటుతుండగా.. కేరళ ఎక్స్ ప్రెస్ ఢీకొని స్పాట్ లోనే మృతిచెందారు. 

సురేష్, చందు ఇద్దరూ మంచిర్యాల నుంచి రామకృష్ణాపూర్ వెళ్లే క్రమంలో రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొని పట్టాలపైనే చనిపోయారు. విషయం తెలియగానే క్యాతన్ పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, స్థానికులు ఘటనాస్థలానికి వెళ్లారు. బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరును నిరసిస్తూ.. ఆందోళన చేపట్టారు. 

బాల్క సుమన్ నిర్లక్ష్యం..

క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆందోళను చేపట్టారు. గత తొమ్మిదేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎన్నోసార్లు బాల్క సుమన్ కు మొరపెట్టుకున్నా.. ఏనాడు పట్టించుకోలేదని, దాని కారణంగానే రైలు ఢీకొని ఇద్దరు చనిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి బాల్క సుమన్ బాధ్యత వహిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. 

2014కు ముందు పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో జీ.వివేక్ వెంకటస్వామి క్యాతన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు . ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో పెద్దపల్లి ఎంపీగా బాల్క సుమన్ గెలిచారు. ఆ తర్వాత 2018 ఎలక్షన్స్ చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలిచారు. వివేక్ వెంకటస్వామి తీసుకువచ్చిన బ్రిడ్జిని ఎంపీగా ఉన్నప్పుడు, చివరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ క్యాతన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేదు బాల్క సుమన్. దాదాపు తొమ్మిన్నరేళ్లు పట్టించుకోకపోవడంతోనే ఇవాళ ఈ రైలు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.