క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు వెళ్తూ ఇద్దరు.. దైవదర్శనానికి వెళ్తూ మరో ఇద్దరు మృతి

క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు వెళ్తూ ఇద్దరు.. దైవదర్శనానికి వెళ్తూ మరో ఇద్దరు మృతి
  •     పటాన్‌‌‌‌‌‌‌‌చెరు ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పై కారును ఢీకొట్టిన లారీ, తండ్రీకూతురు..
  •     సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లాలాపేటలో డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు మృతి

అమీన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌/పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, వెలుగు : కారును లారీ ఢీకొట్టడంతో తండ్రీకూతురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌‌‌‌‌చెరు మండలం పాటి శివారులోని ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పై శనివారం రాత్రి జరిగింది. వివరాలలోకి వెళ్తే.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మేడ్చల్‌‌‌‌‌‌‌‌కు చెందిన తిరుపతి, శ్రీశైలం (43) కుటుంబసభ్యులు కారులో శనివారం రాత్రి తిరుపతికి బయలుదేరారు. పటాన్‌‌‌‌‌‌‌‌చెరు సమీపంలోని ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 2 వద్దకు రాగానే పటాన్‌‌‌‌‌‌‌‌చెరు నుంచి శంషాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీశైలం, అతడి కూతురు సుధీక్ష (5) అక్కడికక్కడే చనిపోగా.. శ్రీశైలం భార్య లక్ష్మి, తిరుపతి, అతడి భార్య జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బీడీఎల్‌‌‌‌‌‌‌‌, ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శ్రీశైలం భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు బీడీఎల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు చెప్పారు. 

క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు వెళ్తూ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు

పద్మారావునగర్/లాలాగూడ, వెలుగు : క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లాలాగూడ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. సీఐ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ప్రాంతానికి చెందిన ఆశ్రిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి (22), బాలాజీ మణికంఠ శివసాయి (23), రాహుల్‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ వేర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు. ఆదివారం ఉదయం క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు నలుగురు కలిసి కారులో మౌలాలి నుంచి తార్నాకకు వెళ్తున్నారు. 

లాలాపేట దోబిఘాట్‌‌‌‌‌‌‌‌ సమీపంలోకి రాగానే కారు కల్వర్ట్‌‌‌‌‌‌‌‌పై ఉన్న డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న ఆశ్రిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పక్కనే కూర్చున్న బాలాజీ మణికంఠ శివసాయి అక్కడికక్కడే చనిపోగా.. వెనుక కూర్చున్న రాహుల్‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌కు గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న లాలాగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కాగా, పొగమంచు కారణంగా డివైడర్‌‌‌‌‌‌‌‌ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.