ఎల్బీనగర్, వెలుగు: కారు ఢీకొని ఎంబీబీఎస్ స్టూడెంట్‌మృతి చెందింది. హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉండే ఎంసాని పాండు కుమార్తె ఐశ్వర్య(19) మహబూబ్ నగర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
సోమవారం ఉదయం తండ్రీకూతుళ్లు ఆర్టీసీ కాలనీ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటి బస్టాండుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
పరిశీలించిన డాక్టర్లు ఐశ్వర్య అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పాండును మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్‌కు పంపించారు. ప్రమాదానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా నిర్ధారించినట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.
మరో చోట యువకుడు..
కూకట్పల్లి, వెలుగు: ముందు వెళ్తున్న కారును బైక్ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం ముల్లపాలెం గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాషా కొడుకు ఉమర్ ఫరూఖ్(24) బీటెక్ పూర్తి చేశాడు. నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 3లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. తన ఫ్రెండ్ షేక్ సుల్తాన్ బాషాతో కలిసి ఆదివారం అర్ధరాత్రి హైటెక్‌సిటీలో టీ తాగేందుకు బైక్‌పై వెళ్లాడు.
సుల్తాన్ బాషా బైక్ డ్రైవ్ చేస్తుండగా ఫరూఖ్ వెనుకాల కుర్చొన్నాడు. జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పైకి చేరుకున్నాక లులూ మాల్ ఎదురుగా ముందు వెళ్తున్న ఓ కారును బైక్ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా హైటెక్‌సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఉమర్ ఫరూఖ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మౌనిక తెలిపారు.
