
- ఒక్కొక్కరికి 2 లక్షల జరిమానా
- మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
కురవి, వెలుగు: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల జరిమాన విధిస్తూ మహబూబాబాద్ జిల్లా జడ్జి చంద్రశేఖర ప్రసాద్ తీర్పు వెల్లడించారు. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ వివరాలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఎస్సీ, బీసీ కాలనీ రోడ్డుపై అప్పటి ఎస్సై భద్రునాయక్ తన సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా లింగాల రోడ్డు నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను ఆపి తనిఖీ చేయగా సుమారు 300 కిలోల 150 గంజాయి ప్యాకెట్స్ దొరికాయి.
వాటి విలువ సుమారు రూ.30 లక్షలు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ బానోతు కిరణ్, బాదావత్ సూర్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఛార్జ్‌షీట్ ఫైల్చేసి కోర్టులో వాదనలు వినిపించగా ఎన్‌డీపీఎస్‌యాక్ట్ ప్రకారం ఇద్దరికి కోర్టు 20 ఏండ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. నిందితులకు శిక్ష పడడానికి కృషి చేసిన అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందిని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించారు.