హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విషాదం.. బతుకుదెరువు కోసం సిటీకి వస్తే.. పాపం ఇలా జరిగింది..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విషాదం.. బతుకుదెరువు కోసం సిటీకి వస్తే.. పాపం ఇలా జరిగింది..

ఉప్పల్, వెలుగు: పిల్లర్‌‌‌‌ గుంతలో పడి అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన భార్యాభర్తలు సుజాత, వెంకటేశ్‌‌బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చి ఉప్పల్‌‌‌లోని కుర్మానగర్‌లో ఉంటున్నారు. వీరికి కొడుకులు మణికంఠ (15), అర్జున్‌ (8), కూతురు ఉన్నారు.

మంగళవారం మణికంఠ, అర్జున్‌‌‌‌ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఉప్పల్‌‌‌‌ పీఎస్‌‌‌లో ఫిర్యాదు చేశారు. ఉప్పల్‌‌భాగాయత్‌‌‌‌ లేఅవుట్‌లోని ఓ కుల సంఘం భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గుంతలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చనిపోయింది మణికంఠ, అర్జున్‌‌‌‌గా గుర్తించారు.

బిల్డింగ్‌‌‌‌ నిర్మాణం కోసం రెండు నెలల కింద పనులు మొదలుపెట్టగా, పిల్లర్లు వేసేందుకు తీసిన గుంతల్లో నీళ్లు చేరాయి. అందులో పడి చిన్నారులు చనిపోయారు. పోలీసులు, హైడ్రా ఆఫీసర్లు, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌‌‌‌బాడీలను బయటకు తీశారు. అయితే పిల్లలు ఆడుకుంటూ వచ్చి గుంతలో పడ్డారా ? లేక ఈత కొట్టేందుకు అందులోకి దిగారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.