దోమకొండలో కుంటలో పడి అక్కాచెల్లెలు మృతి

దోమకొండలో కుంటలో పడి అక్కాచెల్లెలు మృతి
  • కామారెడ్డి జిల్లా దోమకొండ సమీపంలో ఘటన

కామారెడ్డి, వెలుగు : బట్టలు ఉతికేందుకు వెళ్లిన అక్కాచెల్లెలు కుంటలో పడి చనిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో సోమవారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండల కేంద్రానికి సమీపంలో రోడ్డు పక్కన ఉంటున్న దుర్గయ్య, రమేశ్‌‌ కుటుంబాలు చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నాయి. వీరి భార్యలైన అక్కచెల్లెలు పెద్ద రాగుల శివాని (23), చిన్నరాగుల మల్లవ్వ (19)  ఆదివారం బట్టలు ఉతికేందుకు సమీపంలోని నరసింగ కుంట వద్దకు వెళ్లారు. 

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు కుంట వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ బట్టలు మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి కుంటలో గాలించారు. అప్పటికే రాత్రి కావడంతో గాలింపు ఆపివేసి.. సోమవారం ఉదయం మరోసారి నీటిలో గాలించగా.. ఇద్దరి డెడ్‌‌బాడీలు దొరికాయి. వారి తండ్రి గంగారపు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు.