- జ్యోతినగర్ గురుకులంలో 5 గంటల పాటు టెన్షన్
- పర్యవేక్షణ లోపమే అంటున్న పేరెంట్స్
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జ్యో తినగర్ లో ఉన్న మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల విద్యాలయం నుంచి 7వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమై ఐదు గంటల తర్వాత ములుగులో ప్రత్యక్షమైన ఘటన సంచలనం కలిగించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు విద్యార్థినులను సిబ్బంది లెక్కించగా ఇద్దరు విద్యార్థినులు కనిపించడం లేదని గుర్తించారు. గురుకులం సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరా తీయగా పిల్లలు తమ వద్దకు రాలేదన్నారు. వెంటనే ఇటు గురుకులం సిబ్బంది, అటు పేరెంట్స్ వారి కోసం వెతకడం ప్రారంభించారు.
గురుకులం ప్రాంగణంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపం ఉందని మండిపడ్డారు. స్థానికంగా ఓ నివాసంలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలించగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యార్థినులు ఇద్దరూ బయటకు వెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. కాగా, 10 గంటల సమయంలో ఓ విద్యార్థిని బంధువుల ఇంటికి వెళ్లినట్లు వారు సదరు బాలిక తల్లిదండ్రుల కు ఫోన్ చేసి చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే పేరెంట్స్ స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్పై స్కూల్ కు వచ్చి ఆరా తీశారు.
స్కూల్లో పర్యవేక్షణ లోపించిందని, వెంటనే ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కళ్యాణం లక్ష్మీపతి, నల్లమల వేణు డిమాండ్ చేశారు. గురుకులం ప్రిన్సిపాల్ సెలవులో ఉండటంతో ఈ విషయమై గురుకులాల ఇన్చార్జి రాంబాబును వివరణ కోరగా ఘటనపై విచారణ చేపట్టి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసు కుంటామని తెలిపారు. కాగా, ఈఘటన స్థానికంగా 5 గంటలపాటు టెన్షన్ వాతవరణం సృష్టించింది.
