కోతుల దాడిలో ఇద్దరు టీచర్లకు గాయాలు

కోతుల దాడిలో ఇద్దరు టీచర్లకు గాయాలు

అమ్రాబాద్, వెలుగు: డ్యూటీకి వెళ్తున్న ఇద్దరు టీచర్ల బైక్ పై కోతులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాబాద్  మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి వెంకటేశ్, వంగూరు మండలం ఉల్పర ప్రైమరీ స్కూల్ లో, పదర మండల కేంద్రానికి చెందిన బూరం ఆంజనేయులు వెల్దండ మండలంలోని ప్రైమరీ స్కూల్ లో టీచర్లుగా పని చేస్తున్నారు.

శుక్రవారం ఇద్దరు కలిసి వెంకటేశ్   బైక్ పై డ్యూటీకి బయలుదేరారు. మండలంలోని రంగాపూర్  సమీపంలోని ఫారెస్ట్  నర్సరీ వద్ద ఒక్కసారిగా కోతుల గుంపు బైక్ పైకి వచ్చింది. దీంతో బైక్  అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. ఈ ఘటనలో హెల్మెట్ పెట్టుకోవడంతో వెంకటేశ్​కు స్వల్ప గాయాలు కాగా, వెనక ఉన్న ఆంజనేయులు తలకు గాయమైంది. వారిని 108లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.