
- ప్రపంచ దేశాలు వాడుతున్న66 శాతం మందులు మనవే
- ఐక్యరాజ్యసమితిలో ఇండియా ఫస్ట్ సెక్రటరీ పౌలోమి త్రిపాఠి
ఎయిడ్స్‌పై పోరాటంలో ఇండియా ముందుంది. ఆ వ్యాధికి వాడే మందుల్లో మూడింట రెండొంతులు ఇండియా నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సోమవారం ఐక్యరాజ్య సమితి (యూఎన్) సాధారణ సభ సమావేశాల్లో భాగంగా యూఎన్‌లో దేశ శాశ్వత సభ్యత్వ మిషన్‌కు ఫస్ట్ సెక్రటరీ పౌలోమి త్రిపాఠి ఈ విషయం చెప్పారు. ఎయిడ్స్ చికిత్సలో ఇండియా మెరుగైన అభివృద్ధి సాధించిందన్నారు. హెచ్ఐవీని పారదోలే చర్యల్లో భాగంగా 2030 నాటికి భారత్‌కు మరిన్ని సవాళ్లు ఎదురుకాబోతున్నాయనన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్‌కు వాడుతున్న మందుల్లో 66 శాతం దేశ ఫార్మా కంపెనీలు తయారు చేసినవేనని చెప్పారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎయిడ్స్‌కు మెరుగైన చికిత్స లభిస్తోందన్నారు. జబ్బుపై పౌర సంఘాలు, వివిధ గ్రూపులు, హెచ్ఐవీతో బాధపడుతున్నవారు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్లే దేశంలో హెచ్ఐవీ కేసులు తగ్గాయని ఆమె చెప్పారు.
1995తో పోలిస్తే ఇప్పుడు కేసులు 80 శాతం తగ్గాయన్నారు. 2017 నాటికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు క్షయతో చనిపోయిన కేసులూ 84 శాతం తగ్గాయని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 10న హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, దాని వల్ల హెచ్ఐవీతో బాధపడుతున్న వారికి హక్కులు దక్కుతున్నాయని అన్నారు. విద్య ఉపాధి, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఆస్తి హక్కులు, ఇన్సూరెన్స్ వంటి వాటిలో అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. 2017 నాటికి దేశంలో 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్నారు. ఎయిడ్స్ రోగులున్న జాబితాలో ఇండియాది మూడో స్థానం. ఆ ఏడాది 80 వేల కొత్త కేసులు బయటపడగా, 69 వేల మంది చనిపోయారు. 7.5 లక్షల మంది రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తోంది. 2000 నుంచి 2012 మధ్య కొత్త కేసులు సగానికి తగ్గాయి.