పర్వతగిరి(సంగెం), వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిన బాత్రూమ్ గోడ కూలి ఐదవ తరగతి స్టూడెంట్ చనిపోయాడు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపెల్లికి చెందిన వేల్పుల నవదీప్(10) శనివారం ఇంటి సమీపంలో ఉన్న కిరాణా దుకాణంలో బిస్కెట్లు కొనుక్కోడానికి వెళ్తుండగా, దారిలో ఉన్న రమేశ్ ఇంటి బాత్రూమ్ గోడ ఒక్కసారిగా కూలడంతో తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఎంజీఎంకు తరలించగా, అప్పటికే చనిపోయాడు. తాత లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పిల్లర్ల గుంతలో పడి చిన్నారి..
పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్ గ్రామానికి చెందిన ఐదేండ్ల చిన్నారి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ల గుంతలో పడి చనిపోయింది. గ్రామానికి చెందిన ఆత్రం రేణుక, రాము కూతురు పుష్ప( 5) శనివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడిపోయింది. అందుబాటులో ఎవరూ లేకపోవడంతో చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
