నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప ఆలయంలో జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలధారణ చేశారు. దేవాలయంలో గురు స్వామి, ప్రధాన అర్చకుడు రమేష్ శర్మ.. ప్రజ్ఞ, ప్రియ అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు అయ్యప్ప మాల వేశారు. తామూ అయ్యప్పను ఆరాధిస్తామని, గురుస్వాముల సూచనలు, అనుమతితో మాల దీక్ష తీసుకున్నామని ట్రాన్స్జెండర్లు తెలిపారు.
దీక్ష పాటించే అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం నవంబరు నుంచి జనవరి వరకు శబరిమలకు వెళ్లి దీక్షను విరమిస్తుంటారు. ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాలి. అయ్యప్ప స్వామి మాలధారణకు ట్రాన్స్ జెండర్లు అనర్హులనే నియమం ఏం లేదు. ఆ మణికంఠుడిపై భక్తి ఉంటే చాలు. ట్రాన్స్ జెండర్లు కూడా అయ్యప్ప మాలధారణతో హరిహర సుతునిపై భక్తిని చాటుకోవచ్చు.
అయ్యప్ప దీక్ష మత సామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థం. అయ్యప్ప మాలధారణ వల్ల ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది.
శబరిమల యాత్ర ప్రతి ఏడాది నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతుంటారు. మండల పూజ, మకరవిళక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది.
