విషాదం.. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో అదృశ్యమైన చిన్నారి మృతదేహం

విషాదం.. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో అదృశ్యమైన చిన్నారి మృతదేహం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం అదృశ్యమైన చిన్నారి, బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో మృతదేహంగా లభ్యమయ్యింది.వివరాల్లోకి వెడితే ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో కుమార్తె సౌమ్య. మంగళవారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినప్పటికి జాడ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ తో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలోనే బుధవారం చిన్నారి మృతదేహాన్ని నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో స్థానికులు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. అయితే.. ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారి ప్రాణాలు ఎలా కోల్పోయిందన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఎవరైనా అపహరించి చిన్నారిని హత్య చేసారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై శ్వేత తెలిపారు. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.