
గాంధీ నగర్: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కార్లలో ఉన్న ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం (ఆగస్ట్ 17) మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో దేదాదర గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
ఘటన స్థలంలో స్థానికుల సహయంతో పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై వాధ్వన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పిబి జడేజా మీడియాతో మాట్లాడారు. సురేంద్రనగర్ జిల్లాలోని దేదాదర గ్రామ సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు టాటా హారియర్ ఎస్యూవీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రెండు కార్లు వేగంగా ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి అందులోని ఏడుగురు సజీవ దహనమయ్యారని వెల్లడించారు.
►ALSO READ | యూత్ను ఉర్రూతలూగిస్తున్న.. మనాలి స్కేట్‌బోర్డింగ్ వీడియో
మరో ముగ్గురు స్పల్పంగా గాయపడ్డారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, 108 అత్యవసర బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని.. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారాయన.