- 1,300 విమానాలు రద్దు
- 3.90 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బీజింగ్: టైఫూన్ డాల్ఫిన్ ముప్పుతో చైనాలో అధికారులు అప్రమత్తమయ్యారు. షాంఘైలోని హోంగ్‌కియావో, పుడోంగ్ విమానాశ్రయాల్లో 1,300కు పైగా విమానాలను రద్దు చేశారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జెజియాంగ్ ప్రావిన్స్‌లోని తైజౌ నగరం నుంచి 3.90 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం డాల్ఫిన్ చైనా తూర్పు తీరాన్ని తాకింది. జెజియాంగ్‌లోని సాన్మెన్ నుంచి ఫుజియాన్‌లోని ఫుడింగ్ వరకు తుపాన్ ప్రభావం కొనసాగుతోందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్ఎంసీ) తెలిపింది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించింది. తుపాన్ ప్రభావంతో ఆదివారం నుంచి బుధవారం వరకు జెజియాంగ్, షాంఘై, ఫుజియాన్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జెజియాంగ్, దక్షిణ అన్హుయ్లో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడొచ్చని అధికారులు హెచ్చరించారు. కొండవాగులు పొంగిపొర్లడం, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, నగరాల్లో నీరు నిలిచిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని తెలిపారు. తూర్పు చైనా సముద్రం, హాంగ్జౌ బే, జెజియాంగ్ తీర ప్రాంతాల్లో గంటకు 9 నుంచి 12 స్థాయిల్లో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. తుపాన్ కేంద్రానికి సమీపంలో గాలుల తీవ్రత 15 నుంచి 16 స్థాయికి చేరొచ్చని హెచ్చరించారు. డాల్ఫిన్ తీరాన్ని దాటిన తర్వాత వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఎన్ఎంసీ అంచనా వేసింది. తుపాన్ ప్రభావంతో చైనా వాతావరణ శాఖ అత్యవసర స్పందన స్థాయిని లెవల్-3 నుంచి లెవల్-2కు పెంచింది.
