- గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 4 శాతం యూటర్న్ల వద్దే..
- లాంగ్యూ టర్న్ లతో వాహనదారుల్లో అసహనం
- రాంగ్రూట్లలో వెళ్తుండడంతో యాక్సిడెంట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు:ట్రాఫిక్మేనేజ్మెంట్లో భాగంగా నగరంలో యూ-టర్న్‌లను ‘స్మార్ట్ సొల్యూషన్’గా ప్రవేశపెట్టినప్పటికీ అవి ట్రాఫిక్ జామ్‌లు, యాక్సిడెంట్లకు, రాంగ్రూట్డ్రైవింగ్కు కారణమవుతున్నాయి. ఇలా పలువురు ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోతుండగా, ఇంకొంతమంది గాయపడుతున్నారు.
ఈ మధ్య బయటకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 2021 నుంచి 2025 వరకు యూ-టర్న్‌ల వద్ద 366 యాక్సిడెంట్లు జరగ్గా, 25 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 2024లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో నాలుగు శాతం యాక్సిడెంట్లు యూ టర్న్‌ల వద్దే జరిగినట్టు తేలింది.
వీటిలో ఎక్కువగా హబ్సిగూడ, ఉప్పల్, తార్నాక, జూబ్లీహిల్స్ వంటి ప్రధాన ఏరియాలున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో సిగ్నలింగ్వ్యవస్థను ఎత్తేసి యూటర్న్లు ఏర్పాటు చేయడంతో కిలోమీటర్ల దూరం వెళ్లి యూ టర్న్తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అంత ఓపిక లేని కొంతమంది రాంగ్సైడ్డ్రైవింగ్చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు.
పక్కా ప్లాన్లేకపోవడంతోనే..
ట్రాఫిక్సమస్య పరిష్కారానికి గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో అధికారులు యూటర్న్పద్ధతిని తీసుకువచ్చారు. నగరంలోని మేజర్ఏరియాల్లోని సిగ్నల్స్‌వద్ద వాహనాలు వందల మీటర్లు నిలిచిపోతుండడం, అన్ని చోట్లా నియమించేందుకు సరిపడా ట్రాఫిక్సిబ్బంది లేకపోవడం, మెయింటనెన్స్తగ్గించుకునేందుకు యూ టర్న్విధానంవైపు మొగ్గు చూపారు.
అయితే, దానికి తగ్గట్టు ప్లాన్లేకపోవడంతో చాలా చోట్ల యూటర్న్లు విఫలప్రయోగంగా నిలుస్తున్నాయి. రోడ్ల వెడల్పు చేయకపోవడం, డిజైన్ లోపాలుండడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి రకరకాల కారణాలతో యూ టర్న్‌ల వద్ద ట్రాఫిక్ఇబ్బందులతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి.
ఒక్కో చోట కిలోమీటర్ల దూరంలో..
యూటర్న్వ్యూహాల్లో భాగంగా కొన్ని చోట్ల పెట్టిన యూటర్న్లు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఉదాహరణకు ఓయూ నుంచి హబ్సిగూడ, నాచారం వెళ్లాలనుకునే వాహనదారులు ఇంతకుముందు తార్నాక చౌరస్తా నుంచి సిగ్నల్నుంచి వెళ్లిపోయేవారు. కానీ, దీన్ని మూసేసి దాదాపు కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉండే మెట్టుగూడ సమీపంలో యూటర్న్ఇచ్చారు. దీంతో వాహనదారుల గమ్యస్థానం కళ్లెదుటే కనబడుతున్నా నిట్టూర్చుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.
సోమాజిగూడ యశోద హాస్పిటల్నుంచి నెక్లెస్‌రోడ్డు రైల్వేస్టేషన్ కు మూడు వందల మీటర్లు కూడా ఉండదు. ఇంతకుముందు సమీపంలోని పెట్రోల్బంక్ఏరియా ఎదుట యూ టర్న్ ఉండేది. దీన్ని మూసేసి సోమాజిగూడ సర్కిల్లో యూటర్న్‌కు ఆప్షన్ఇచ్చారు. దీంతో యశోద నుంచి రైల్వేస్టేషన్వెళ్లాలనుకునే పేషెంట్లు, ఇతర వాహనదారులు సోమాజిగూడ సర్కిల్‌కు వెళ్లి టర్న్తీసుకుని మళ్లీ యశోద మీదుగానే నెక్లెస్‌రోడ్డు రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి వస్తోంది.
సరోజిని ఐ హాస్పిటల్నుంచి మెహిదీపట్నం వెళ్లాలంటే 500 మీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఇక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లాలంటే మసాబ్ట్యాంక్ఫ్లై ఓవర్వరకూ చేరుకోవాల్సి వస్తోంది. ఫ్లై ఓవర్‌కింద యూ టర్న్తీసుకుని మెహిదీపట్నం వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్లు ప్రయాణించాలి. పైగా ఈ దారిలో ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు చుక్కలు చూడాల్సి వస్తున్నది.
లక్డీకాపూల్బ్రిడ్జి దాటిన తర్వాత సైఫాబాద్పోలీస్స్టేషన్మీదుగా వెళ్లి ఎలక్షన్భవన్ఎదురుగా యూటర్న్తీసుకోవాలి. అయితే, సైఫాబాద్పీఎస్ఎదుట ఒక మెర్జింగ్పాయింట్పెట్టారు. లక్డీకాపూల్నుంచి ఇంకో రూట్లో వచ్చేవారు. మసాబ్ట్యాంక్వైపు వెళ్లాలంటే ఈ మెర్జింగ్రూట్ లో రావాల్సి ఉంటుంది. అయితే, నాంపల్లి గల్లీల్లోంచి వచ్చే వారు ఎలక్షన్భవన్వరకూ వెళ్లకుండా ఈ మెర్జింగ్రూట్లో రాంగ్రూట్లో వస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫీవర్దవాఖాన దగ్గర తిలక్నగర్బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలు విద్యానగర్వెళ్లాలంటే..దాదాపు బర్కత్‌పురా వరకూ వచ్చి యూటర్న్ తీసుకోవాలి. దీంతో అది దూరంగా భావించి కోరంటి సిగ్నల్నుంచే రాంగ్ రూట్లో వెళ్లి విద్యానగర్ రూల్‌లో మెర్జ్అవుతున్నారు. ఇక్కడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద హైటెక్ సిటీ నుంచి మియాపూర్ వైపు వెళ్లే రోడ్డు క్లోజ్ చేశారు..హైటెక్ సిటీ నుండి వచ్చే వాహనాలు మియాపూర్ వెళ్లాలంటే 500 మీటర్ల దూరంలో ఉన్న యూటర్న్ వద్ద వాహనాలు మలుపుకొని మియాపూర్ వైపు వెళ్లాలి. యూటర్న్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.
యాక్సిడెంట్లకు కేరాఫ్ బ్లాక్ స్పాట్స్
ట్రాఫిక్సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన యూటర్న్ల వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అవుతుఓంది. కొన్ని చోట్ల ఇది సుమారు 10- నుంచి15 నిమిషాల వరకూ ఉంటోంది. అలాగే, యూ-టర్న్‌ల వద్ద మెర్జింగ్ సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల మెట్రో రూట్ఉన్న ప్రాంతాల్లో రోడ్డు దాటే వారిని వాహనాలు ఢీకొని గాయపడుతున్నారు. ఈ క్రమంలో 2024లో హైదరాబాద్ పోలీసులు 54 యూ-టర్న్ బ్లాక్ స్పాట్లను గుర్తించారు.
వీటి వద్ద 11 యాక్సిడెంట్లు జరిగి 12 మంది చనిపోయినట్టు తేల్చారు. ఇందులో ఎక్కువ జరిగినవి బైక్యాక్సిడెంట్లు కాగా, 8 మంది బైకర్లు కన్నుమూశారు. రాచకొండ పరిధిలో ఎన్‌హెచ్65పై 99 బ్లాక్‌స్పాట్లు ఉండగా, మూడు యూ-టర్నుల వద్ద 2022--–24 మధ్యలో 23 యాక్సిడెంట్లు జరిగి13 మంది చనిపోయారు.
యూటర్న్ల వద్ద వెహికల్స్ స్లో అవుతుండగా.. స్ట్రెయిట్‌గా వెళ్లేవారు అంచనా తప్పి వెనక నుంచి ఢీకొడుతున్నారు. అలాగే.. కొన్ని చోట్ల బస్సులు, లారీలు, వ్యాన్ల వంటి వాహనాలు రోడ్డుకు పూర్తిగా లెఫ్ట్సైడ్వచ్చి సడన్‌గా యూ టర్న్తీసుకోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
లాంగ్ యూటర్న్రూట్లలో లో ఎక్కువ వెహికల్స్ఉండడం వల్ల అవి యూటర్న్తీసుకొని లేన్మారుతుండగా..ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొడుతున్నాయి. కిలోమీటర్ల కొద్దీ దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం వల్ల రాంగ్రూట్వెళ్తూ కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎంతోమంది గాయపడుతున్నారు.
లూప్ తో సమస్యలు
నగరంలో చాలా చోట్ల ఈ లూప్సమస్యలు వేధిస్తున్నాయి. ఒక జంక్షన్లో యూటర్న్గానీ, రైట్టర్న్గాని మూసేసేనప్పుడు నేరుగా కొంతదూరంలో యూటర్న్ ఏర్పాటు చేస్తారు. దీంతో ఒకచోట యూ టర్న్, రైట్టర్న్తీసుకోవాలనుకునే వారు అదనపు దూరాన్ని ప్రయాణించాల్సి వస్తుంది. తార్నాక, ఉప్పల్, కోరంటి, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో
ఈ ఇష్యూ ఉంది.
ఫలితాలు ఇవ్వట్లేదని తార్నాక జంక్షన్ క్లోజ్
తార్నాక జంక్షన్ (ఫ్లైఓవర్ కింద) కొన్నేండ్ల కింద క్లోజ్‌చేసిన చౌరస్తాను ట్రాఫిక్ పోలీసుల కొంతకాలం కింద ఓపెన్చేశారు డ్రోన్ సర్వేలు, గూగుల్ ట్రాఫిక్ డేటా, సిగ్నల్ టైమింగ్ పరీక్షలు, ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా తెరిచినా..ఇక్కడ రోడ్డు వెడల్పు లేకపోవడం, మెట్రో స్తంభం రోడ్డు మధ్యలో ఉండటం వల్ల ట్రాఫిక్సమస్య పెరుగుతుందని తేల్చారు. సిగ్నల్ ఉండడం వల్ల 30 సెకన్లకు అంతకుమించి వెయిట్చేయాల్సి వస్తుందని సిగ్నల్మళ్లీ క్లోజ్ చేశారు. కానీ, పర్మినెంట్సొల్యూషన్గురించి ఆలోచించలేదు. ఇతర చోట్లా ఇలాగే జరుగుతుందనే ఉహతో యూటర్న్‌లను కంటిన్యూ చేస్తున్నారు.
ఏం చేయాలి?
- డ్రైవర్లు యూ-టర్న్‌ల వద్ద వేగాన్ని తగ్గించాలి..
- సేఫ్ ఫాలోయింగ్ డిస్టెన్స్ పాటించాలి..
- బ్లాక్‌స్పాట్‌ల్లో సైన్‌బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలి.
- లాంగ్డిస్టెన్స్లో ఉన్న యూటర్న్ల దూరాన్ని తగ్గించాలి.
- అవసరం ఉన్న చోట, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం లేని ప్రాంతాల్లో సిగ్నల్స్ ను పునరుద్ధరించాలి
- కొన్ని చౌరస్తాల్లో రైట్టర్న్లకు అనుమతి ఇవ్వాలి
