Usman Khan: UAE క్రికెట్ బోర్డును బురిడీ కొట్టించిన పాక్ క్రికెటర్.. ఐదేళ్లు నిషేధం

Usman Khan: UAE క్రికెట్ బోర్డును బురిడీ కొట్టించిన పాక్ క్రికెటర్.. ఐదేళ్లు నిషేధం

పాకిస్థాన్‌ బార్న్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్.. పుట్టిన దేశం తరపున ఆడేందుకు ఆసక్తి చూపడంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అంతకముందు అతడు యూఏఈ తరుపున ఆడతానంటూ వాగ్ధానం చేసి.. అవకాశాలు రాగానే పాక్ పక్షాన చేరడమే అందుకు కారణం.

28 ఏళ్ల ఉస్మాన్ ఖాన్.. ఇటీవల జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌(PSL)లో ఓవర్సీస్ ప్లేయర్‌గా బరిలోకి దిగి వరుస సెంచరీలు బాదాడు. దీంతో అతనికి పుట్టిన దేశం తరుపున ఆడేందుకు పీసీబీ సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. అందుకు ఉస్మాన్ అంగీకరించడంతో.. దేశ ఆర్మీ చెంత శిక్షణ పొందుతున్నాడు.

ఐదేళ్లు నిషేధం

ఫలితంగా, ఉస్మాన్ ఖాన్ 2029 వరకు ఈసీబీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా నిషేధం విధించారు. యూఏఈ వేదికగా జరిగే ILT20, అబుదాబి T10 లేదా ఏదేని ఇతర ఈసీబీ అనుబంధ పోటీలలో అతడు పాల్గొనలేడు. ఉస్మాన్ ఖాన్ తన ఉద్దేశాలను తప్పుగా చూపించారని ఈసీబీ ఆరోపించింది. యూఏఈ జట్టుకు ఆడాలనే తన నిర్ణయం గురించి ఉస్మాన్ బోర్డుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.  ఈసీబీ అందించిన అవకాశాలను  ఉపయోగించుకొని.. బాధ్యతలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. ఉస్మాన్ ఖాన్ పై నిషేధం శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి అమలులోకి వచ్చింది.