సౌదీలో మరణశిక్ష పడిన భారతీయుడ్ని కాపాడాడు

 సౌదీలో మరణశిక్ష పడిన భారతీయుడ్ని కాపాడాడు
  • 2012లో కారు నడుపుతూ బాలుడి మృతికి కారణమైన కేరళ కార్ డ్రైవర్ బెక్స్ కృష్ణన్ (45)
  • యూఏఈ చట్టాల ప్రకారం మరణశిక్ష విధించిన సుప్రీంకోర్టు
  • నెల రోజులు కష్టపడి మరణశిక్ష నుండి తప్పించిన లూలూ అధినేత యూసఫ్ అలీ
  • శిక్ష నుండి బయటపడిన తర్వాత కేరళకు వెళ్లేందుకు సాయం చేసిన యూసఫ్ అలీ

అవును నిజమే. నమ్మశక్యం కాని ఆశ్చర్యకరమైన ఘటన. మన దేశంలో మరణ శిక్ష పడిన వారిని కాపాడడం వరకు సాధ్యమోమో కానీ.. అత్యంత కఠినమైన చట్టాలు అమలు చేసే గల్ఫ్ దేశంలో మరణ శిక్ష నుండి భారతీయుడ్ని తప్పించడం సాధ్యమేనని నిరూపించాడు లూలూ అధినేత యూసఫ్ అలీ. ప్రపంచంలోనే అరుదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 
కేరళకు చెందిన బెక్స్ కృష్ణన్ ఉపాధి కోసం యూఏఈ వలస వెళ్లాడు. 2012లో కారు నడుపుతుండగా సూడాన్ దేశానికి చెందిన ఓ బాలుడు ప్రమాదంలో చనిపోయాడు. అయితే కృష్ణన్ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే బాలుడు చనిపోయాడని పోలీసుల అభియోగాల మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాక, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు యూఏఈ సుప్రీం కోర్టు కృష్ణన్ కు మరణ శిక్ష విధించింది. 
కృష్ణన్ ఉద్దేశ పూర్వకంగా తప్పు చేయలేదని.. పొరపాటు వల్ల జరిగిన ప్రమాదం అంటూ అతని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తమ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 
చివరి ప్రయత్నంగా పెద్ద మనసున్న దాతగా పేరుపొందిన ఎన్ఆర్ఐ లూలూ అధినేత యూసఫ్ అలీని కృష్ణన్ కుటుంబ సభ్యులు కలసి కేసు వివరాలు తెలియజేశారు. న్యాయ నిపుణుల సలహాతో ఆయన కేసును టేకప్ చేసి విడిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే బాలుడి కుటుంబ సభ్యులు సూడాన్ కు వెళ్లిపోవడంతో వారితో సుప్రీం కోర్టుకు క్షమాభిక్ష ప్రసాదించమని చెబితే మరణ శిక్ష నుండి తప్పించే అవకాశం ఉందని తెలిసింది. దీంతో ఆయన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రయత్నాల గురించి కంపెనీలోని ముఖ్య భాగస్వాములతో చర్చించారు. అతడ్ని విడిపించే ప్రయత్నాలకు మార్గాలు అన్వేషిస్తున్నానని.. మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పమని కోరాడు.

తన వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నాలు చేసి సూడాన్ వెళ్లిన బాలుడి కుటుంబ సభ్యుల అంగీకారం తెలుసుకున్నాడు. వారిని వెంటనే యూఏఈ రప్పించి సుప్రీంకోర్టులో హాజరుపరిచాడు. పరిహారం కింద కోటి రూపాయలు చెల్లించేందుకు అంగీకారమేనంటూ కోర్టులోనే చెల్లించాడు. దీంతో యూఏఈ సుప్రీం కోర్టు మరణ శిక్షను రద్దు చేసింది. రెండు దేశాలకు చెందిన దౌత్యపరమైన ప్రక్రియ కావడంతో మరి కొద్ది రోజుల్లోనే కృష్ణన్ కేరళకు తిరిగొచ్చేందుకు మార్గం సుగమం అయింది. తనకు విధించిన మరణ శిక్షను ఎప్పుడు అమలు చేస్తారోనని అక్కడి జైలులో కుమిలిపోతున్న కృష్ణన్ కు స్థానిక పోలీసులు కోర్టు నిర్ణయాన్ని తెలియజేశారు.

యూసఫ్ అలీ జోక్యంతో శిక్ష రద్దయిందని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయినట్లు సమాచారం. తాను జైలు నుంచి విడుదలైన వెంటనే యూసఫ్ అలీని కలిసిన తర్వాతే కేరళకు తిరిగి వెళతానని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా మరణశిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులివ్వగానే నెల రోజులకుపైగా తీవ్ర ఉద్వేగంతో గడిపిన యూసఫ్ అలీ సంతోషంతో హర్షం వ్యక్తం చేశాడు. ఒక నిండు ప్రాణం కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలు సఫలం కావడం దేవుడి దయేనని వినయంగా ప్రకటించాడు. తాను కోటి రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడం వల్లే బతికాడన్న కామెంట్లను ఆయన తోసిపుచ్చుతూ అంతా దేవుడి దయ అని. ఆయన వల్లే ఇవన్నీ సాధ్యమైనాయని చెప్పారు. కృష్ణన్ సొంతూరికి వెళ్లి ప్రశాంతంగా కొత్త జీవితం గడపాలని ఆశిస్తున్నానని తెలిపారు.